ఒకట్రెండు రోజుల్లో తెరాస జాబితా

ఒకట్రెండు రోజుల్లో తెరాస జాబితా

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితాను రేపు లేదా ఎల్లుండి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రేశేఖరరావు ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. సిట్టింగులు వినోద్‌ కుమార్‌ (కరీంనగర్‌), కవిత (నిజామాబాద్‌), కొత్త ప్రభాకరరెడ్డి (మెదక్‌), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌), బీ. నర్సయ్య గౌడ్‌ (భువనగిరి), జీ. నగేశ్‌ (ఆదిలాబాద్‌) అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. ఎమ్మెల్యేల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత కారణంగా జితేందర్‌ రెడ్డికి మళ్లీ మహబూబ్‌నగర్‌ అభ్యర్థిత్వం దక్కడం అనుమానంగా మారింది. ఆయన స్థానంలో ఎంఎస్‌. రెడ్డిని ఎంపిక చేయవచ్చు. ఆయన ఎంఎస్‌ఎన్‌ ఔషధ సంస్థ వ్యవస్థాపకుడు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్టు దక్కే విషయంలో అనుమానాలున్నాయి. వైసీపీ నుంచి తెరాసలో చేరిన ఆయనపై అక్కడి నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని సమాచారం. అందువల్లే శాసన సభ ఎన్నికల్లో పార్టీ ఆ జిల్లాలో దారుణంగా ఓటమిపాలైంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్ల తనకే టికెట్టు లభిస్తుందని ఆయన ఘంటా పథంగా చెబుతున్నా, పార్టీ జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్‌ అనే కొత్త నాయకుని పేరును ప్రతిపాదిస్తున్నారు. మహబూబాబాద్‌ టికెట్టు సిట్టింగ్‌ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌కు మళ్లీ టికెట్టు లభిస్తుందా అనే విషయంలో అనుమానాలున్నాయి. వరంగల్‌ సిట్టింగు పీ. దయాకర్‌కు మళ్లీ టికెట్టు కేటాయించే విషయంలో అనిశ్చితి నెలకొంది. ఈ స్థానానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరును పరిశీలిస్తున్నారు. నల్గొండ నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మళ్లీ పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. అదే కనుక నిజమైతే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పేరును పరిశీలించే అవకాశాలున్నాయి. పొంగులేటికి ఖమ్మం కాదంటే, నల్గొండ నుంచి పోటీ చేయమని చెప్పవచ్చు. చేవెళ్ల స్థానానికి అభ్యర్థి ఎంపిక క్లిష్టంగా మారింది. పెద్దపల్లిలో మాజీ ఎంపీ జీ. వివేక్ పోటీ చేయవచ్చు. మల్కాజ్‌గిరి స్థానాన్ని ముగ్గురు ఆశిస్తున్నారు. సికింద్రాబాద్‌ స్థానానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తనయుడు సాయి కిరణ్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి యాదవ్‌లు పోటీ పడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos