హొసూరులో ఉచితంగా హెల్మెట్ల పంపిణీ

హొసూరు : గాంధీ జయంతిని పురస్కరించుకొని హొసూరులో తాగు నీటి ట్యాంకర్ల యజమానులు వాహన చోదకులకు 150 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని అవగాహన కలిగించారు. హొసూరు-బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా వేల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో వేల మంది కార్మికులు పనిచేస్తున్నందున జాతీయ రహదారిపై నిత్యం వాహనాల రద్దీ ఎక్కువ. దీని వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. వందల సంఖ్యలో వాహన చోదకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ద్విచక్ర వాహనాల చోదకులు హెల్మెట్ ధరించక పోవడంతో ప్రమాదాల సమయంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో పోలీసు యంత్రాంగం, పలు స్వచ్ఛంద సంస్థలు తరచూ హెల్మెట్ అవగాహన ర్యాలీలు నిర్వహించాయి.అందులో భాగంగా నేడు జాతి పిత మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని హొసూరు తాగు నీటి ట్యాంకర్ లారీల యజమానులు హొసూరు పారిశ్రామిక వాడ జాతీయ రహదారిపై వాహనాలపై వచ్చే వారికి ఉచితంగా 150 హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని సూచిస్తూ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ల వాడకంపై ప్రజలకు అవగాహన కలిగించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos