కోయంబత్తూరు: మనుషులకైనా, జంతువులకైనా అమ్మ ప్రేమ ముందు ఏదీ సాటిరాదు. ఓ గుర్రపు పిల్ల ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. బొమ్మను చూసి అమ్మ అనుకుని దాని వెంట పరుగులు పెట్టింది. హృదయాలను కలచివేసే ఈ ఘటన నగరంలో జరిగింది. పేరూరు పట్టీశ్వర ఆలయం సమీపంలోని ఒక గుర్రం పిల్ల ఇటీవల తన అమ్మను కోల్పోయింది. అప్పటి నుంచి అమ్మ కోసం పరితపిస్తుండేది. అంతలో ఓ బస్సుపై ఉన్న గుర్రపు బొమ్మ దానికి కనిపించింది. ఆ బొమ్మను తన అమ్మ అనుకుంది. సంతోషంగా దగ్గరకు వెళ్లి బొమ్మను తనివితీరా చూసుకుంది. బస్సు చుట్టూ తిరుగుతూ గంతులేసింది. అంతలో బస్సు ముందుకు కదిలింది. చిట్టి గుర్రం దాని వెంట పరుగులు తీసింది. బస్సు వేగం పెరగడంతో చిట్టి గుర్రం అందుకోలేకపోయింది. ఈ ఘటన చాలా మందికి కన్నీళ్లు తెప్పించింది. తన తల్లి కోసం చిట్టి గుర్రం పడిన ఆరాటం అందరిని కలిచివేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.