హోసూరు స్థానంపై వీడని సస్పెన్ష్

హోసూరు : అధికార ఎడిఎంకె కూటమిలో హోసూరు నియోజకవర్గాన్ని ఎవరికి కేటాయిస్తారోనని అటు ఎడిఎంకె, ఇటు బిజెపి నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 6వ తేది జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని ఎడిఎంకె, డిఎంకె పార్టీలు మిత్ర పక్షాలకు స్థానాల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నాయి. కృష్ణగిరి జిల్లాలోని 6 నియోజకవర్గాలలో ఎడిఎంకె పార్టీ తరవున పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే విషయమై ఇప్పటికే చూచాయగా తెలిసినప్పటికీ, హోసూరు నియోజకవర్గాన్ని ఎడిఎంకె అట్టి పెట్టుకుంటుందా లేక మిత్రపక్షమైన బిజెపికి కేటాయిస్తుందా అనే సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎడిఎంకె తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఒక వేళ హోసూరు నియోజకవర్గ వర్గాన్ని బిజెపికి కేటాయిస్తే ఎడిఎంకె ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చని ఆపార్టీకి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హోసూరు నియోజకవర్గాన్ని మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి ఎడిఎంకెకు పెట్టని కోటగా మార్చారని, ఇప్పుడు బిజెపికి కేటాయిస్తే పరాభవం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణగిరి జిల్లాలో ఎడిఎంకె పార్టీ నిలదొక్కుకొనేందుకు కెపిఎం, తంబిదురై, బాలకృష్ణారెడ్డిలు తీవ్రంగా కృషి చేశారని, ఇప్పుడు అధిష్టానం తప్పటడుగు వేస్తే వారి కష్టం గంగపాలైనట్లేనని ఎడిఎంకె పార్టీ నాయకులు వాపోతున్నరు. జిల్లాలోనే హోసూరు నియోజక వర్గంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తరుణంలో ఎడిఎంకె అధిష్టానం తొందరపడి బిజెపికి కేటాయిస్తే ఆ పార్టీ గెలుపు అసాధ్యమని అంటున్నారు. బాలకృష్ణారెడ్డి మంత్రి పదవి చేపట్టిన తరువాత హోసూరు ప్రాంతంలో పార్టీకి బలం మరింత పెరిగిందని, ఇక్కడ బలహీనంగా ఉన్న బిజెపికి ఈ స్థానాన్ని కేటాయిస్తే ఎడిఎంకె మనుగడ ప్రశ్నార్థకమవుతుందని కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎడిఎంకె అధిష్టానం ఆరు నూరైనా హోసూరు స్థానాన్ని అట్టి పెట్టుకోవాలని, బిజెపికి కేటాయిస్తే ఎన్నికలకు ముందే డిఎంకె కూటమి ఖాతాలో ఓ స్థానం చేరినట్లు భావించి తీరాలని పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos