హొసూరు : ఆరో తరగతి నుంచి ప్లస్ టు వరకు తమిళ మాధ్యమంలో అభ్యసించిన వారు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ ఇటీవల శాసన సభలో ప్రకటన చేయడంపై హొసూరు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ మండిపడ్డారు. ఈ కొత్త నిబంధన హొసూరు ప్రాంతంలో అనాదిగా తెలుగు మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్న వారికి శరాఘాతమని పేర్కొన్నారు. శాసన సభలో మంత్రి ఈ ప్రకటన చేసినప్పుడు తెలుగువారి ఓట్లతో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎస్‌ఏ. సత్య (హొసూరు), వై. ప్రకాష్ (తళి), మురుగన్ (వేపనపల్లి)లు ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలుగు అభ్యర్థులకు వ్యతిరేకమైన ఆ ప్రకటన వెలువడినప్పుడు, సభలో ఉండి కూడా వారెందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. కొత్త నిబంధన వల్ల తెలుగు అభ్యర్థులకు కచ్చితంగా అన్యాయం జరుగుతుందని, కనుక ఈ ప్రాంత ఎమ్మెల్యేలు వెంటనే ముఖ్యమంత్రిని సంప్రదించి, ఆ నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తాను కూడా సహకరిస్తానని తెలిపారు. ఆ నిబంధన జీవో రూపం దాల్చకముందే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. లేనట్లయితే హొసూరు ప్రాంతంలో తెలుగు మాధ్యమంలో అభ్యసించిన అభ్యర్థులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎండమావిగా మారుతాయని హెచ్చరించారు.నష్టం జరక్కముందే, దీనిపై గట్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. భాషా అల్ప సంఖ్యాకులైన కన్నడ, మలయాళం, ఉర్దూ అభ్యర్థులు కూడా ఈ కొత్త నిబంధనతో రాష్ర్ష్ట్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.