చెన్నై : తమిళనాడులో తెలుగు చదువుకునే విద్యార్థులు 2016 నుంచి తీవ్ర గందరగోళం మధ్య పరీక్షలను రాయాల్సి వస్తుందని, ఈ ఏడాది నుంచి దానికి తెర దించాలని తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఏటా పరీక్షలకు ముందు, అంటే ఫిబ్రవరి చివరి వారంలో ఏ భాషలో పరీక్షలు రాయాలనే మీమాంసను విద్యార్థులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లడం, అక్కడి నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందడం…పరిపాటిగా మారిందని వివరించారు. దీనిపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర హోం శాఖ మంత్రి, గవర్నర్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…ప్రభృతులను కలసినా ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. తమిళనాట తెలుగు భాషను కాపాడుకోవడానికి ఇక్కడి తెలుగువారందరూ సంఘటితంగా ఉండాలని కోరారు. 2006లో తీసుకొచ్చిన నిర్బంధ తమిళ బోధనా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఇటీవల ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్‌ను కోరామని గుర్తు చేశారు. 2021లో రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వస్తే తెలుగు, కన్నడ, మలయాళం విద్యార్థులు వారి మాతృభాషలోనే విద్యాభ్యాసం కొనసాగించేలా అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో స్టాలిన్ చిత్తశుద్ధిని కనబరిస్తే తెలుగు వారందరూ వచ్చే ఎన్నికల్లో ఆయనకు అండగా నిలబడతారని పేర్కొన్నారు. అదే సమయంలో తమకు మేలు చేసే వారికే ఓటు వేయాలని ఆయన తమిళనాడులోని తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు.