వ్యవసాయ వర్సిటీ భూమిలో హైకోర్టు వద్దు

వ్యవసాయ వర్సిటీ భూమిలో హైకోర్టు వద్దు

హైదరాబాద్:ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి చెందిన వందెకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 55 జీవోను గతనెల 21న జారీ చేసిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ భూముల్లో కాకుండా ఇతర ప్రభుత్వ భూముల్లో హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం కేటాయించిన ఈ భూమిలో వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన పశు సంవర్దన, ఉద్యానవన, పట్టుపరిశ్రమ తదితరాలపై పరిశోధనలతోపాటు, ‘బయో డైవర్సిటీ ప్లాంటేషన్’ కొనసాగుతున్నదని వివరించింది. ఈ విశ్వవిద్యాలయ భూములను హైకోర్టు భవన నిర్మాణం కోసం తీసుకోవడం సరైందికాదని తెలిపింది. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములు కూడా ఇతర సంస్థలకు కేటాయించడంతో లక్ష్యం దెబ్బతిన్నదని గుర్తు చేసింది. దీనివల్ల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ చుట్టు పక్కల వివిధ రకాల ప్రభుత్వ భూములున్నాయని పేర్కొంది. వాటిని కొంతమంది ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది. రెవెన్యూ శాఖ ద్వారా సర్వే చేయించి హైకోర్టుకు అవసరమైన భూమిని హైదరాబాద్ చుట్టు పక్కల కేటాయించాలని ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కోరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos