పెట్టుబడిదారుల చేతిలో దేశ సంపద

పెట్టుబడిదారుల చేతిలో దేశ సంపద

రాంచీ : దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ గిరిజనులు, వెనుకబడిన తరగతులు, పేదల భూములను ప్రభుత్వం లాగేసుకొని అదానీ వంటి పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. జార్ఖండ్లోని గుమ్లా వద్ద రాహుల్ విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీల భూమిని కేంద్రం లాగేసుకుంటోందని ఆరోపించారు. ‘దేశంలో కేవలం రెండే కులాలు ధనికులు, పేదలు ఉన్నాయని ప్రధాని మోడీ చెబుతున్నారు. మరి ఆయన తనది మూడో కులం ఓబీసీ అని ఎందుకు చెప్పుకుంటున్నారు?’ అని రాహుల్ ప్రశ్నించారు. అందుకే సంపద ఎవరి చేతిలో ఉందో గుర్తించాల్సి ఉందన్నారు. దేశ సంపద మొత్తం కొందరు ఎంపిక చేసిన బిలియనీర్ల చేతిలోనే ఉండాలని బీజేపీ కోరుకుంటోందని చెప్పారు. దేశంలో సామాజిక న్యాయం సాధించడం చాలా ముఖ్యమని అంటూ ప్రస్తుతం రిజర్వేషన్లను యాభై శాతానికే పరిమితం చేశారని గుర్తు చేశారు. ‘దేశంలో 8శాతం గిరిజనులు, 15శాతం దళితులు, 50శాతం ఓబీసీలు ఉన్నారు. వీరందరి జనాభా 73శాతం వరకూ ఉంది. అలాంటప్పుడు రిజర్వేషన్లను 50%కే పరిమితం చేయడం ఏమిటి? అందుకే కులగణన జరపాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీని మారుస్తామని, చిన్న, మధ్య తరహా వ్యాపారాల కోసం కొత్తగా ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ‘మనం పోరాటాన్ని కొనసాగించాల్సిందే.
అది ఎన్నికల కమిషన్ కానివ్వండి. దర్యాప్తు సంస్థలు కానివ్వండి. అధికార యంత్రాంగం కానివ్వండి. పోలీసులు కానివ్వండి. ఈ వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నారు. వీటితో మనం పోరాడాల్సిన అవసరం ఉంది’ అని రాహుల్ తెలిపారు. క్షీర విప్లవం, హరిత విప్లవం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. పేదలు, దళితులు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos