సీఎల్పీ లీడర్‌ను రాహుల్‌ నిర్ణయిస్తారా..

! హైదరాబాద్‌ : కాంగ్రెస్‌శాసనసభ పక్ష నేత (సీఎల్పీ) ఎన్నిక సమావేశం గాంధీభవన్‌లో హాట్‌హాట్‌ మొదలైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో కాంగ్రెస్‌ శాసన సభాపక్షం సమావేశమయ్యింది. శాసనసభ పక్ష నేతగా ఎవరిని నియమించాలనే నిర్ణయాధికారాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కట్టబెడుతూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ప్రక్రియకు అధిష్టానం తరఫున పరిశీలకుడిగా నియమితుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌కు చేరుకుని.. సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియపై కోర్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని ఏఐసీసీకి అందించారు. వాటి ఆధారంగా సీఎల్పీ నేతను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఇవాళే పూర్తవుతుందని, సాయంత్రానికల్లా సీఎల్పీ నేతను ప్రకటిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు టీకాంగ్రెస్‌ ఇంచార్జి ఆర్సీ కుంతియా సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, సీఎల్పీ నేతగా భట్టివిక్రమార్క పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి,  శ్రీధర్‌బాబు కూడా రేసులో ఉన్నారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేరును పార్టీలోని కొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. సీఎల్పీ లీడర్‌ పదవి తనకే కావాలంటూ పలువురు పట్టుబట్టడంతో గురువారం ఉదయం ప్రారంభమైన సీఎల్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది.

పాత నాయకత్వాన్ని పూర్తిగా బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశమివ్వాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్‌ చేశారు. సీఎల్పీ నేతగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని నియమించాలని అన్నారు. అయితే,  సీనియర్‌ నాయకుడిని అయినందున సీఎల్పీ లీడర్‌గా తనకే అవకాశమివ్వాలని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని అన్నారు.  గత డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 19 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos