రైల్లోనే ప్రసవం

  • In Local
  • February 4, 2019
  • 817 Views

హైదరాబాద్‌ : నెలలు నిండిన గర్భిణి రైలులో ప్రయాణం చేస్తూ అందులోనే ప్రసవించింది.  విశాఖపట్నం-ఎలమంచిలి రైల్వేస్టేషన్ల నడుమ జరిగింది. స్వప్నదేవి నిండు గర్భిణి తన ఇద్దరు పిల్లలతో కలిసి అంగ ఎక్స్‌ప్రెస్ లో భువనేశ్వర్‌ నుంచి యశ్వంత్‌పూర్‌కు ఏసీ కోచ్‌-బీ2లో ప్రయాణిస్తోంది. ఈమె వెంట కుటుంబ సభ్యులెవరూ లేరు. రైలు తుని రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత స్వప్న పురిటి నొప్పులతో బాధపడుతోంది. విషయాన్ని గమనించిన తోటి మహిళా ప్రయాణికులు రైలులో విధులు నిర్వర్తిస్తున్న టీటీఐ సనత్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన అత్యవసర వైద్య చికిత్స కోసం కమర్షియల్‌ కంట్రోల్‌ అధికారికి విషయాన్ని తెలుపగా రైలు అప్పటికే తుని స్టేషన్‌ దాటివెళ్లింది. ఈ క్రమంలో విశాఖపట్నానికి వెళ్లేందుకు సమయం పడుతుందని టీటీఐ సనత్‌.. వచ్చే స్టేషన్‌లో రైలు ఆపాలని, అక్కడ 108 సౌకర్యం కల్పించాలని కోరారు. దీంతో కమర్షియల్‌ కంట్రోలర్‌ యలమంచిలి స్టేషన్‌ వద్ద రైలు ఆపేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవడంతోపాటు స్టేషన్‌లోని ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫాంపై వైద్యం కోసం తగిన ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో రైలు యలమంచిలి స్టేషన్‌కు చేరుకునేలోపు స్వప్నకు పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. తోటి మహిళా ప్రయాణికుల సాయంతో రైలులోనే మగ బిడ్డకు జన్మ నిచ్చింది. అనంతరం స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత డాక్టర్‌, 108 సిబ్బంది తల్లి, బిడ్డకు చికిత్సలు అందించారు. గర్భిణికి వైద్య చికిత్సలు అందించేందుకు కృషిచేసిన టీటీఈ సనత్‌ సేవలను రైల్వే డీఆర్‌ఎం ధనంజనేయులు, సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి, పలువురు అధికారులు ప్రశంసించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos