భారత్‌లో పెళ్లి.. ఆస్ట్రేలియాలో విడాకులా?

  • In Crime
  • January 21, 2019
  • 784 Views
భారత్‌లో పెళ్లి.. ఆస్ట్రేలియాలో విడాకులా?

కట్నకానుకలు తీసుకొని భారతీయ సంప్రదాయం ప్రకారం ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిని ఆస్ట్రేలియా తీసుకెళ్లి వేధించి పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని తిరిగి భారత్‌కు పంపాడు. ఆ వెంటనే ఆస్ట్రేలియా కోర్టులో విడాకులు మంజూరు చేయించుకుని.. మరో పెళ్లి చేసుకున్నాడు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు భారత్‌లో పెళ్లి జరిగితే.. ఆస్ట్రేలియా కోర్టు విడాకులు ఎలా ఇస్తుందని బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి తల్లిదండ్రులు, రెండో భార్యను అరెస్టు చేశారు.బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా నూజివీడు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కన్నికంటి వంశీకృష్ణ(32) పదేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. 2015 ఆగస్టులో బంజారాహిల్స్‌కు చెందిన సిరిచందన(26)ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి రూ.30లక్షల నగదు, 40 సవర్ల బంగారం కట్నంగా తీసుకున్నాడు. పెళ్లైన 20 రోజులకు సిరిచందనను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టి, అదనపు కట్నం కావాలంటూ వేధించేవాడు. పెళ్లికి ముందు రూ.4.50 లక్షల జీతం అని నమ్మించాడు. ఈ విషయంలోనూ నిలదీయడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. సిరిచందన విషయాన్ని తల్లిదండ్రులు, అత్తమామల దృష్టికి తీసుకెళ్లారు. మన దేశానికి వచ్చి పెద్దల సమక్షంలో సయోధ్య కుదుర్చుకుందామని నమ్మించి 2016లో సిరిచందనను ఇక్కడకు పంపాడు. ఇక్కడకు రాగానే ఆమె వీసాను, పీఆర్‌ను రద్దు చేసి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లలేని స్థితి కల్పించాడు. అప్పటి నుంచి నాలుగు నెలల పాటు వంశీకృష్ణ భారత్‌కు వస్తున్నట్లూ నమ్మిస్తూ ఆస్ట్రేలియాలోని న్యాయవాది ద్వారా విడాకుల నోటీసు పంపాడు. సిరిచందన అక్కడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆస్ట్రేలియా కోర్టులో విడాకులు మంజూరైంది. ఈ విషయం అత్తమామకు తెలిపినా కూర్చొని మాట్లాడుకుందామని నమ్మిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వంశీకృష్ణ తన మరదలి వరస అయ్యే అనంతనేని రాధను గతేడాది నవంబరులో వివాహం చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న బాధితురాలు భారతదేశంలో పెళ్లయితే ఆస్ట్రేలియా కోర్టు మంజూరు చేసే విడాకులు చెల్లదని వంశీకృష్ణ, అతని తల్లిదండ్రులు సీతామహాలక్ష్మి, రామారావు, రెండో వివాహం చేసుకున్న రాధపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్లో ఈ నెల 6వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 494, రెడ్‌ విత్‌ 109, 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మూడు రోజుల క్రితం రామారావు, సీతామహాలక్ష్మితోపాటు నగరానికి వచ్చిన రాధను అరెస్టు చేశారు. వంశీకృష్ణ ఆస్ట్రేలియాలో ఉండటంతో పోలీసులు అక్కడికి నోటీసులు పంపారు. కోర్టులో హాజరుపర్చగా ముగ్గురినీ రిమాండ్‌కు ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos