ఇసి పనితీరుపై సడలుతున్న విశ్వాసం

ఇసి పనితీరుపై సడలుతున్న విశ్వాసం

న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి పాలక పక్షానికి వ్యతిరేకంగా ఎన్ని ఫిర్యాదులు అందుతున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాల నేతలపై అందిన ఫిర్యాదులపై ఆఘమేఘాలపై స్పందించే ఇసి..అధికార బిజెపి నేతలపై అందే ఫిర్యాదులపై మీనమేషాలు లెక్కిస్తూ దాటేస్తుండటంతో రాజ్యాంగ సంస్థపై క్రమేపి విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇసి ప్రారంభించిన సీవిజిల్ యాప్ పనితీరు దారుణంగా ఉంది. అందులో ఫిర్యాదులే నమోదు కావడం లేదు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై సీవిజిల్ యాప్, నేషనల్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (ఎన్జిఆర్ఎస్) ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని ఇసి పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తోంది. కానీ ఈ రెండూ పని చేస్తున్న దాఖలాలు లేవని ‘స్క్రోల్’ పోర్టల్ తేల్చింది. ఒకవేళ ఫిర్యాదును స్వీకరించినా స్పందన పేలవంగా ఉంటోందని తెలిపింది. మరి కోడ్ ఉల్లంఘలను గురించి ఎవరికి చెప్పుకోవాలి? కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ, ముస్లిం మైనారిటీలను కించపరుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 21న రాజస్థాన్లోని బన్స్వారాలో చేసిన ఎన్నికల ప్రసంగానికి సంబంధించిన వీడియోను పూనేకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంకిత్ శుక్లా చూశారు. ఆయన గతంలో ఎన్నడూ ఎన్నికల కమిషన్కు లేఖలు రాయలేదు. కానీ మోడీ ప్రసంగాన్ని విన్న రోజు రాత్రే ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు ఇ-మెయిల్ పంపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన మోడీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘భారతీయులకు వ్యతిరేకంగా విద్వేషం, మతోన్మాదం అనే విషంతో మనసును నింపుకున్న వ్యక్తిని ఎన్నికల్లో పాలుపంచుకునేందుకు అనుమతించకూడదు’ అని అందులో సూచించారు. అయితే శుక్లాకు ఇప్పటి వరకూ ఇసి నుండి సమాధానమే రాలేదు.

హద్దులు దాటినా చర్యలు లేవు

ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని హద్దులూ దాటి ప్రతిపక్షాలపై నిందారోపణలు చేస్తున్నారు. ముస్లిం మైనారిటీలపై విషం చిమ్ముతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఒబిసిల రిజర్వేషన్లును రద్దు చేసి వాటిని ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. మరోవైపు ముస్లింలను కించపరిచే వీడియోలను సామాజిక మాధ్యమాలలో బిజెపి ప్రచారంలో పెడుతోంది. ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ కంటికి ఇవేమీ కన్పించడం లేదు. విద్వేష ప్రసంగాలు చెవులకు విన్పించడం లేదు. హిందూత్వ పార్టీ బాహాటంగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా మౌనం వహిస్తోంది. బన్స్వారాలో మోడీ చేసిన ప్రసంగంపై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు ఎన్నికల కమిషన్ నోటీసు పంపింది. అందులో ఎక్కడా మోడీ పేరు లేదు. ముస్లింలను పరాన్నజీవి అయిన కోడిగా చూపుతూ కర్నాటక రాష్ట్ర బిజెపి హ్యాండిల్ ఈ నెల 3న విద్వేషంతో నిండిన ఒక కారికేచర్ వీడియోను పోస్ట్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుండి ‘నిధుల’ దాణా అందుకున్న తర్వాత ఆ కోడి ఎస్సీ, ఎస్టీ, ఒబిసి పిల్లలను గూడు నుండి బయటకు తరిమేసినట్లు అందులో చిత్రించారు. ఈ కారికేచర్పై ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఇసి పట్టించుకోలేదు. కర్నాటకలో పోలింగ్ పూర్తయ్యే వరకూ వేచి ఉండి, ఆ తర్వాత వీడియోను తొలగించాలని ట్విటర్కు ఆదేశాలు జారీ చేసింది. అంతే తప్ప బిజెపిపై ఎలాంటి చర్యలు లేవు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos