తీరనున్న జర్నలిస్టుల సొంతింటి కల

  • In Local
  • February 4, 2019
  • 802 Views

హైదరాబాద్‌: జంట నగరాల్లో పనిచేస్తున్న అర్హులైన పాత్రికేయులందరికీ ఇల్లు సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కృతనిశ్చయంతో ఉన్నారని జర్నలిస్టు నాయకుడు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అన్నారు. నిజాంపేటలో జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీకి కేటాయించిన 32 ఎకరాల స్థలంలో జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే క్రాంతి మాట్లాడుతూ సొసైటీ సభ్యుల సొంతింటి కల అతి త్వరలోనే తీరునుందన్నారు నిజాంపేటలోని 32 ఎకరాలతో పాటు పేట్‌బషీరాబాద్‌లోని 38 ఎకరాలు జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ సొసైటీకి ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం విషయంలో సీఎం సానుకూల దృక్పథంతో ఉంటారని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్‌ మురళి అన్నారు. జవహర్‌లాల్‌నెహ్రూ జర్నలిస్టు సొసైటీ సభ్యులకే కాకుండా మిగిలిన అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి సౌకర్యం కల్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి వంశీ శ్రీనివాస్‌ సొసైటీ కార్యకలాపాలను వివరిస్తూ కొన్ని న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని వాటిని పరిష్కరించే విషయంలో సీఎం, కేటీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కేటీఆర్‌ సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో చర్చించారన్నారు. స్వయంగా రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ను సమన్వయం చేయాల్సిందిగా కేటీఆర్‌ కోరారని తెలిపారు. రెండో సారి సీఎంగా ఎన్నికైన కేసీఆర్‌కు జనరల్‌బాడీ అభినందనలు తెలిపింది. రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రజలకు ఉన్న అపార నమ్మకం మరోసారి రుజువైందని సభ్యులు అభిప్రాయపడ్డరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సొసైటీ అధ్యక్షుడు క్రాంతికిరణ్‌ను సన్మానించారు. సీనియర్‌ పాత్రికేయులు బుద్ధ మురళి తెలంగాణ సమాచార కమిషనర్‌గా నియమితులైన సందర్భంగా ఆయనను కూడా సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వం జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ సొసైటీకి స్థలం బదలాయించవ్చని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ప్రభుత్వం సొసైటీకి 32 ఎకరాలు ఇప్పటికే బదలాయించిందన్నారు. మరో 38 ఎకరాల బదలాయింపు ప్రక్రియ జరుగుతోంది జర్నలిస్టులకు కేటాయించిన భూమి ఆక్రమణలకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు సొసైటీ నేతలు తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు జ్యోతిప్రసాద్‌, రవికుమార్‌, రవికాంత్‌రెడ్డి తదితరులతోపాటు వందలాది మంది సభ్యులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos