ఉద్యోగాల పేరిట రూ.100 కోట్లకు టోపీ

ఉద్యోగాల పేరిట రూ.100 కోట్లకు టోపీ

  • విజ్డమ్ జాబ్స్ పోర్టల్ భారీ మాయాజాలం
  • యజమాని అజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • భారత్ తో పాటు గల్ఫ్ దేశాల్లోనూ బాధితులు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. భారత్ తో పాటు అమెరికా, యూరప్ లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ భారీ మోసానికి తెరలేపింది. నిరుద్యోగ యువతీయువకుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు.. సంస్థ యజమానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజ్డమ్ జాబ్స్ పోర్టల్ నిరుద్యోగులను టార్గెట్ చేసుకుంది. తమకు 4,000 మంది విదేశీ క్లయింట్లు ఉన్నారనీ, విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ఈ పోర్టల్ లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఇక్కడి నుంచి అసలు మోసం మొదలయింది. విజ్డమ్ సంస్థ ప్రతినిధులు ఫోన్ చేసి ‘మీకు ఫలానా కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది. ఇందుకోసం ప్రీమియంగా మీరు ఇంత మొత్తం చెల్లించాలి. నగదు చెల్లింపులు పూర్తయ్యాక ఇంటర్వ్యూ నిర్వహిస్తాం.’ అంటూ బాధితులకు ఫోన్ కాల్స్ చేసేవారు. మీ రెజ్యుమెను అప్ డేట్ చేయడానికి ఇంత చెల్లించాలనీ, ఇంటర్వ్యూ కోసం మరికొంత చెల్లించాలని చెప్పేవారు. వీరి మాటలు నమ్మిన యువతీయువకులు రూ.1,000 నుంచి రూ.లక్ష వరకూ నగదును సమర్పించుకున్నారు. అయితే తమ గుట్టు బయటపడకుండా విజ్డమ్ నిర్వాహకులు అప్పుడప్పుడూ సొంత మనుషులనే విదేశీ కంపెనీ ప్రతినిధులుగా చూపుతూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. చివరికి డబ్బులు కట్టినా ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో హైదరాబాద్ కు చెందిన ఓ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అధికారులు.. విజ్డమ్ జాబ్ పోర్టల్ యజమాని అజయ్ కొల్లాంను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. నిందితుడు ఇక్కడి వారిని మాత్రమే కాకుండా విదేశాలకు చెందిన వారిని సైతం ఉద్యోగాల పేరుతో మోసం చేశాడని తెలిపారు. ఇలా నిరుద్యోగులకు రూ.100 కోట్లకుపైగా కుచ్చుటోపి పెట్టాడని పేర్కొన్నారు. భారత్ తో పాటు గల్ఫ్ దేశాలకు చెందిన పలువురు బాధితులు వీరి చేతిలో మోసపోయారన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos