తిరుమల ఖాళీ…ఖాళీ

తిరుమల ఖాళీ…ఖాళీ

తిరుమల : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేపట్టిన ముందస్తు చర్యలతో తిరుమల కొండ ఖాళీ అయ్యింది. స్వామి వారి దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు లేక కొండ వెలవెలబోతోంది. అలిపిరి చెక్‌పోస్టు కూడా ఖాళీగా కనిపిస్తోంది. స్వామివారికి నిర్వహించే కైంకర్యాలన్నింటినీ శాస్త్రోక్తంగా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు కొండపైకి భక్తుల అనుమతి నిలిపివేసిన తితిదే.. తదుపరి పరిస్థితులపై సమీక్షించి ప్రకటించనుంది. తిరుమలలో ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, కల్యాణ కట్ట, అన్నదాన సత్రం మూతపడ్డాయి.

128 ఏళ్ల తర్వాత…

తరాల చరిత ఉన్న తిరుమల శ్రీనివాసుడి ఆలయంలో 128 ఏళ్ల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. కరోనా వైరస్‌ ప్రభావంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని శుక్రవారం నుంచి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. స్వామివారి సేవలను, కైంకర్యాలను ఆగమ శాస్త్రాలను అనుసరించి అర్చకులు ఏకాంతంగా పూర్తి చేయనున్నారు. 1892లో అప్పటి అర్చకులు, మఠాధిపతులు, జీయంగార్లు సమావేశం నిర్వహించి, వివిధ కారణాల రీత్యా రెండురోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేసినట్లు చరిత్ర రికార్డులు చెబుతున్నాయి. అప్పటి నుంచి కేవలం గ్రహణాల సందర్భంగా మాత్రమే ఆలయాన్ని మూసివేస్తున్నారు. ఇటీవల 2018 ఆగస్టు రెండో వారంలో బాలాలయ అష్టదిగ్భంద మహాసంప్రోక్షణ సమయంలోనూ ఐదు రోజుల పాటు భక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. పరిమితంగా అనుమతించారు. ఆ సమయంలో తిరుమల క్షేత్రం బోసిపోయి కన్పించింది. అంతకుముందు 2013లో సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కొన్నిరోజుల పాటు ఆర్టీసీ సర్వీసులను తిరుమలకు తిప్పలేదు. దీంతో కొండపై భక్తుల రద్దీ తగ్గింది తప్ఫ. పూర్తిగా దర్శనం ఆగిపోయిన దాఖలాలు లేవు. ఎన్నో తుపాన్లు, ఉత్పాతాలు సంభవించిన సమయంలోనూ దేవదేవుడి కటాక్ష వీక్షణానికి భక్తులు నేరుగా దూరం కాలేదు. అలాంటిది కరోనా వైరస్‌ ప్రభావంతో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos