పశ్చిమ బెంగాల్ లో స్వల్ప ఘర్షణలు

పశ్చిమ బెంగాల్ లో స్వల్ప ఘర్షణలు

న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా లోక్ సభ మూడో దశ ఎన్నికలకు మంగళవారం పోలింగ్ జరుగుతోంది. మూడో దశ పోలింగ్ లో పది రాష్ట్రాల్లోని మొత్తం 93 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ 93 నియోజకవర్గాల్లో మొత్తం 17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 93 లోక్ సభ స్థానాల్లో 72 నియోజకవర్గాలు జనరల్ స్థానాలు కాగా, 10 షెడ్యూల్డ్ క్యాస్ట్, 11 షెడ్యూల్ ట్రైబల్స్ కు రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. ఈ మూడో దశ ఎన్నికలు మొత్తం 10 రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అసోంలో 4 స్థానాలకు, బిహార్ లో 5 , ఛత్తీస్ గఢ్ లో 7, గోవాలో 2 , గుజరాత్లో 26 , కర్ణాటకలో 14, మధ్యప్రదేశ్ లో 8 , మహారాష్ట్ర 11, ఉత్తర్ ప్రదేశ్ లో 10, పశ్చిమ బెంగాల్ లో 4, దాద్రా నగర్ హవేలీలో , డయ్యూ డామన్ లలో రెండు స్థానాలకు మంగళవారం పోలింగ్ జరుగుతోంది. వాస్తవానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మూడోదశ ఎన్నికల్లో మొత్తం 94 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ఇవ్వగా గుజరాత్ లోని సూరత్ నియోజకవర్గంలో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆ లోక్ సభ స్థానానికి ఎన్నిక జరగడం లేదు.
2019 లోక్ సభ ఎన్నికల్లో ఈ 94 సీట్లలో బీజేపీ 72 సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్, శివసేన నాలుగేసి సీట్లను గెలుచుకున్నాయి. జనతా దళ్ (యూనైటెడ్) , ఎన్సీపీ లు మూడేసి సీట్లలో గెలుపొందాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని సమాజ్ వాదీ రెండు సీట్లు, పశ్చిమబెంగాల్ లోని టీఎంసీ పార్టీ రెండు సీట్లు గెలుచుకున్నాయి. ఇక లోక్ జనశక్తి పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది. మిగిలిన రెండు సీట్లలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మంగళవారం జరుగుతున్న మూడో దశ ఎన్నికల పోలింగ్ లో గాంధీనగర్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుణ నియోజకవర్గం నుంచి జ్యోతిరాదిత్య సింధియా, విదిషా నియోజకవర్గం నుంచి శివరాజ్ సింగ్ చౌహన్, రాజ్ కోట్ నియోజకవర్గం నుంచి పురుషోత్తం రుపాలా, బెల్గం లోక్ సభ స్థానం నుంచి జగదీశ్ షెట్టర్, హవేరీ నియోజకవర్గం నుంచి బసవరాజ్ బొమ్మై, శివమొగ్గ లోక్ సభ స్థానం నుంచి రాఘవేంద్ర వంటి ప్రముఖులు పోటీ లో ఉన్నారు. ఇక మొయిన్ పూరి నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ నుంచి డింపుల్ యాదవ్, రాజ్ గఢ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శివరాజ్ కుమార్, చిక్కోడి నియోజక వర్గం నుంచి ప్రియాంక జారికోలి పోటీ లో ఉన్నారు.
ఈ మూడో దశ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి పలువరు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమిత్ షా పోటీ చేస్తున్న గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గంలో కూడా ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్ర లోని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఎన్సీపీ అభ్యర్థిగా బారామతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్థానానికి నేడు ఎన్నిక జరుగుతోంది. ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ కూడా తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ లో ని జాంగిపూర్ నియోజకవర్గంలో స్వల్ప ఘర్షణలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధనంజయ్ ఘోష్ కు స్థానిక టీఎంసీ కార్యకర్తకు మధ్య ఓ పోలింగ్ బూత్ లో గొడవ జరిగింది. ఓటర్లను ప్రభావితం చేసేలా పోలింగ్ బూత్ ల వద్ద ధనంజయ్ ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఆరోపించడంతో అక్కడ స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos