ప్రజ్వల్‌ తలెత్తుకోకుండా చేయాలి

ప్రజ్వల్‌ తలెత్తుకోకుండా చేయాలి

బెంగళూరు: రాసలీలల ప్రజ్వల్ రేవణ్ణకు విధించే శిక్ష ఆయన్ని తలెత్తుకొని తిరగకుండా చేయాలని అత్యాచార బాధితురాలి సోదరి మాల (పేరు మార్చడం జరిగింది) అభిప్రాయపడ్డారు. జేడీఎస్ ఎంపీ, హసన్ లోక్సభ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రికార్డు చేసిన మూడు వేల వీడియో క్లిప్పింగుల్లో బాధితురాలు మృదుల (పేరు మార్చడం జరిగింది) కూడా ఉన్నారు. అయితే ఆ విషయాన్ని మృదుల కుటుంబసభ్యులు గుర్తించే లోగానే రేవణ్ణ కుటుంబ సన్నిహితుడు సతీష్ బాబన్న ఆమెను కిడ్నాప్ చేసి తీసికెళ్లాడు. వీడియోల వ్యవహారాన్ని మృదుల బంధువులు, స్నేహితులు ఆమె కుమారుడి దృష్టికి తీసికెళ్లారు. మృదుల, ఆమె భర్త ఇద్దరూ ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవణ్ణ వ్యవసాయ క్షేత్రంలో పనిచేశారు. మూడు సంవత్సరాల క్రితం అక్కడ పని మానేసి గర్భిణిగా ఉన్న కుమార్తె బాగోగులు చూసుకోవడానికి మైసూరు జిల్లాలోని స్వగ్రామం వచ్చారు. ‘ఆమె తనపై జరిగిన అత్యాచారం గురించి అప్పుడు కూడా ఎవరికీ చెప్పలేదు. మేము ఆమెను తిడతామేమోనని భయపడి ఉంటుంది. కానీ ఆమె అత్యాచారానికి గురైంది. ఆమె ఏ తప్పూ చేయలేదు. కానీ ప్రజలేమో ఆమెదే తప్పని అంటున్నారు. మా తప్పేమీ లేకపోయినా పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు’ అని మృదుల సోదరి మాల చెప్పారు.
సతీష్ను ఈ నెల 3న పోలీసులు అరెస్టు చేసి మృదులను కాపాడారు. ఆ మరునాడు బెంగళూరు తీసుకొచ్చారు. అదే రోజు హెచ్డీ రేవణ్ణను కూడా అరెస్టు చేశారు. రెండు లుక్అవుట్ నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రజ్వల్ ఇంకా పరారీలోనే ఉన్నారు. కుటుంబసభ్యులు మృదులను చిట్టచివరి సారిగా గత నెల 24న చూశారు. సతీష్తో కలిసి వెళ్లిన మృదుల పోలింగ్ రోజు తిరిగి వచ్చారు. రెండు రోజుల తర్వాత సతీష్ మళ్లీ వచ్చి తనతో రావాలని మృదులను ఒత్తిడి చేశాడు. మృదులకు సంబంధించిన ఓ పోలీసు కేసుకు సంబంధించి మాట్లాడేందుకు రమ్మని హెచ్డీ రేవణ్ణ చెప్పారని తెలిపాడు. దీంతో ఆమె సతీష్ వెంట వెళ్లారు.
ఆ తర్వాత మృదులను కలిసేందుకు కుటుంబసభ్యులు ఎంతగానో ప్రయత్నించారు. అయితే మృదులను పోలీసులు అరెస్ట్ చేశారని, బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని సతీష్ వారికి చెప్పాడు. మృదులను బంధించి అత్యాచారం జరిపిన వీడియో బయటకు వచ్చిన తర్వాతే ఆమె కుమారుడికి విషయం తెలిసింది. మృదులను కిడ్నాప్ చేశారని అర్థం చేసుకున్న కుటుంబసభ్యులు ఈ నెల 2న కేఆర్ నగర పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ప్రజ్వల్ రాజకీయ ప్రత్యర్థులు ఆ వీడియోలను పెన్డ్రైవ్లలో అప్లోడ్ చేసి హసన్ జిల్లాలోని పార్కులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాపులు, దుకాణాల్లో పంపిణీ చేశారు. హసన్లో పోలింగుకు ముందు ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. మృదుల సోదరి మాలకు రేవణ్ణ, ప్రజ్వల్ గురించి పెద్దగా తెలియదు. ఆమె ఓ పండుగ కోసం గత నెల 29న స్వగ్రామానికి వచ్చారు. తమకు ఏ అవసరం వచ్చినా రేవణ్ణ భార్యను కలిసేవారమని, ఉద్యోగం ఉన్నదని సతీష్ చెప్పడంతో అంగీకరించామని అంటూ ఇలా జరుగుతుందని ఎవరు ఊహిస్తారు అని ఆవేదనతో ప్రశ్నించారు. మృదుల కుటుంబం రెండు గదులు చిన్న ఇంటిలో నివసిస్తోంది. కేసు నమోదైనప్పటి నుండి వారి ఇంటి వద్ద పోలీసులు కాపలాగా ఉన్నారు. ఇప్పుడు రేవణ్ణ కుటుంబం అంటే తామేమీ భయపడడం లేదని మృదుల బంధువులు తెలిపారు. రేవణ్ణ కుటుంబంపై మృదుల గ్రామస్తులు మండిపడుతున్నారు. తమ ఊరి పేరు నాశనం చేశాడంటూ శాపనార్థాలు పెడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos