హోసూరు ఆలయాల్లో చోరీ యత్నాలు

హోసూరు ఆలయాల్లో చోరీ యత్నాలు

హోసూరు : హోసూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ చంద్రచూడేశ్వర స్వామి దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా హోసూరు ప్రాంతంలోని అన్ని దేవాలయాలు మూతపడ్డాయి. ప్రసిద్ధి పొందిన చంద్రచూడేశ్వర స్వామి దేవాలయం, రామ్నగర్లోని కోట మరియమ్మ దేవాలయంలో భక్తులను అనుమతించకుండా పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొండపై ఉన్న చంద్రచూడేశ్వరస్వామి దేవాలయంలోకి చొరబడి దేవాలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలు పగలగొట్టారు. తరువాత ఆలయం తలుపులకు వేసిన తాళం పగులగొడుతుండగా అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రంగన్ అనే వ్యక్తికి శబ్దం వినిపించింది. అతను బయటకు వచ్చి చూడగా ముగ్గురు వ్యక్తులు దేవాలయ తలుపునకు వేసిన తాళం పగులగొడుతున్న దృశ్యం కంటపడింది. అప్రమత్తమైన రంగన్ తన వద్ద ఉన్న కత్తితో దొంగలను వెంబడించాడు.
హతాశులైన దొంగలు సీసీటీవీ కెమెరాలను చెత్తకుప్పలో పడవేసి అక్కడి నుండి తప్పించుకున్నారు. దేవాలయంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న రంగన్ అప్రమత్తంగా ఉండడం వల్ల చోరీ జరగలేదు. అదేవిధంగా హోసూరులోని మరో ప్రాంతంలో ఉన్న మునీశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడి ఆలయ ప్రాంగణంలో ఉన్న హుండీని పగులగొట్టి
అందులో ఉన్న సుమారు పది వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఈ రెండు సంఘటనలపై హోసూరు పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకే రోజు దొంగలు రెండు దేవాలయాల్లో చోరీకి ప్రయత్నించడం హోసూరు పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos