శ్రీలంక ప్రధాని ఇంటికి…

శ్రీలంక ప్రధాని ఇంటికి…

కొలంబో : శ్రీలంక ప్రధానమంత్రి పదవి నుంచి తన అన్నయ్య మహిందా రాజపక్స తొలగింపునకు ఆ దేశాధ్యక్షుడు గొటాబయ రాజపక్స అంగీకారం తెలిపారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభంపై జనాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో గొటాబయ రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పరిస్థితుల కారణంగా ఏర్పడిన రాజకీయ సంక్షోభం పరిష్కారానికై మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు ప్రతిపాదనలో గొటాబయ ఈ మేరకు సమ్మతం తెలిపారు. కొత్త ప్రధాన మంత్రి ఎంపిక కోసం నేషనల్ కౌన్సిల్ ఏర్పాటుకు ఆయన సంసిద్ధత తెలిపారని శ్రీలంక ఎంపీ, ఆ దేశ మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో స్వయంగా దేశాధ్యక్షుడు గొటాబయ రాజపక్స, ప్రధాని మహిందా రాజపక్సతోపాటు వీరి కుటుంబానికి చెందిన ఇతర నేతలపైనా దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అధికారం నుంచి దిగిపోవాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటాబయ రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా విదేశీ అప్పులు భారీగా పేరుకుపోవడం, కరోనా కట్టడిగా వరుసగా లాక్‌డౌన్లు విధించడం, ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, విదేశీ మారక నిల్వలు అడుగంటడం, కరెన్సీ విలువ దిగజారడం వంటి ప్రతికూల ప్రభావాలన్నీ ఒకేసారి ఎదురవ్వడంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. శ్రీలంక ఈ ఏడాది 7 బిలియన్ డాలర్ల అప్పు చెల్లించాల్సి ఉంది. 2026 నాటికల్లా 25 బిలియన్ డాలర్లు చెల్లించాలి. ఆ దేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 1 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉండడం ఆ దేశ దీన స్థితిని తెలియజేస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos