ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

చెన్నై : భారతదేశానికి మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, ఫెడరలిజం, సామాజిక న్యాయం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. దేశ ప్రజలు తమ సమస్యలను లేవనెత్తుతున్నప్పుడు ప్రధాని మోడీ సమాధానం చెప్పడం లేదన్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మదురైలో సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి వెంకటేషన్ గెలిపించాలని ప్రచారం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ప్రజలకు వివిధ పథకాలను అమలు చేస్తామన్న నరేంద్ర మోడీ.. పండుగ సీజన్లో ప్రజలు మాంసాహారం తింటున్నారనే అంశాన్ని లేవనెత్తుతున్నారన్నారు. 79 శాతం మంది భారతీయులు మాంసాహారం తింటున్నారని చెప్పుతున్నారని, ఇదే.. మోడీకి ప్రధాన సమస్యగా ఉందా? అని ఏచూరి ప్రశ్నించారు. ప్రజలను పోలరైజ్ చేయడం, శాఖాహారం, మాంసాహారం, హిందువులను, హిందువేతరులను విడకొట్టడం మోడీ కుట్రలో భాగమన్నారు. ఈ దేశ మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, ఫెడరలిజం, సామాజిక న్యాయం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ కారణంగానే లౌకిక ప్రజాస్వామ్యంలో భారతదేశం అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటోందని తెలిపారు. బీజేపీి పాలిత రాష్ట్రాల్లో లవ్ జిహాద్, గో సంరక్షణ తదితరాల పేరుతో మత ధృవీకరణకు పదును పెట్టే లక్ష్యంతో కొత్త చట్టాలను రూపొందించారని చెప్పారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన క్రూరమైన చట్టాల వల్ల ప్రజాస్వామ్యం ధ్వంసమవుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛను మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. దేశ సంపదను పూర్తిగా దోచుకుని, సహజ వనరులను లూటీ చేశారని తెలిపారు. కార్పొరేట్ల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల అంశాన్ని ఉటంకిస్తూ.. రాజకీయ అవినీతిని వివిధ మార్గాల ద్వారా చట్టబద్ధం చేశారని ఏచూరి విమర్శించారు. ఈ అంశంపై విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ కోరుకున్నది ఫెడరలిజం, వైవిధ్యం కాదని, ఏకీకృత ప్రభుత్వమే అని విమర్శించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బీజేపీ నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. భారత్ను ఫాసిస్టు హిందుత్వ రాజ్యంగా మార్చాలని కోరుకుంటోందని తెలిపారు. ఈ దేశంలో మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించినప్పటికీ మోడీ పెడచెవిన పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రయివేటీకరణ పేరుతో ఆదివాసీలను అటవీ భూముల నుంచి గెంటేశారని, దళితులపై అఘాయిత్యాల పెరుగుతున్నాయని, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎంపిలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. నిరుద్యోగం రేటు ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos