హక్కులను కాలరాస్తూ అభివృద్ధికి హామీ

హక్కులను కాలరాస్తూ అభివృద్ధికి హామీ

తిరువనంతపురం : కేరళ విషయంలో ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తప్పుబట్టారు. కేరళను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసి, అర్హత ఉన్న హక్కులను కాలరాస్తూ కేంద్రంలోని మోడీ సర్కారు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి అభివృద్ధి ప్యాకేజీలు ఇస్తామని హామీ ఇస్తున్నదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి స్పందించారు. త్రిసూర్ లోక్సభ నియోజకవర్గంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) అభ్యర్థి వి.ఎస్ సునీల్ కుమార్ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ”వరదలు, కరోనా, నిపా వ్యాప్తి, ఓఖీ దయనీయ పరిస్థితులను రాష్ట్రం ఎదుర్కొన్నది. మేము మద్దతు కోసం పోరాడుతున్నాము. అర్హత ఉన్న ప్రత్యేక ప్యాకేజీని కూడా కేంద్రం నిరాకరించింది. ఇది మద్దతును తిరస్కరించడమే కాకుండా, మాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఇతర దేశాల నుంచి సహాయం తీసుకోకుండా మమ్మల్ని ఆపింది. ప్రవాస కేరళీయుల నుంచి సాయం సేకరించేందుకు మంత్రులు విదేశాలకు వెళ్లేందుకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వలేదు” అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
‘మేం బతికాం’
తాము చాలా క్లిష్ట సమయాల్లో బయటపడ్డామని విజయన్ చెప్పారు. ”ప్రపంచం మొత్తం మనవైపు ఆశ్చర్యంగా చూసింది. దీన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. కేరళపై బీజేపీ ప్రతీకారం తీర్చుకున్నది. ఎందుకంటే కేరళ బీజేపీని రాష్ట్రం నుంచి గెలవడానికి ఎప్పుడూ అనుమతించలేదు” అని ఆయన అన్నారు. ”గత ఐదేండ్లలో జాతీయ రహదారి అభివృద్ధికి భూమిని సేకరించినందుకు రాష్ట్రం రూ.5,600 కోట్లు చెల్లించవలసి వచ్చింది. దేశంలో ఇలాంటి ఏ చిన్న రాష్ట్రం ఇంత భారీ మొత్తంలో ఇవ్వలేదు. రాష్ట్రానికి మోడీ హైస్పీడ్ రైలు నెట్వర్క్ను అందిస్తున్నారు. అయితే, అది కే-రైలు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించినదేనని గుర్తుంచుకోవాలి. మన రాష్ట్రాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేరళ ఇప్పటికే విద్య, ఆరోగ్యం, ఇతర రంగాలలో అభివృద్ధి చెందినందుకు ప్రపంచం గుర్తించింది. ఇవి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉన్నాయి” అని విజయన్ చెప్పారు.తీరప్రాంత అభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్రం ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నదనీ, మనుషుల కంటే వన్యప్రాణులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. మన దేశం ప్రమాదంలో ఉన్నదనీ, దేశ రాజ్యాంగంలోని సారాంశమైన ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని మనం రక్షించుకోవాలని విజయన్ పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos