యూపీ పోలీసు దాష్టీకం

యూపీ పోలీసు దాష్టీకం

కాన్పూరు : ఉత్తరప్రదేశ్ పోలీసుల రూటే వేరు. వివాదాస్పద ప్రవర్తనతో వారెప్పుడూ వార్తల్లో ఉంటారు. తాజాగా…వేధింపుల నుంచి కాపాడాలంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలిని ఓ హెడ్ కానిస్టేబుల్ తన అభ్యంతరకర మాటలతో వేధించాడు. కాన్పూరులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విటర్‌లో పోస్టు చేస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 ఏళ్ల బాలికను గత కొద్ది రోజులుగా కొందరు యువకులు వేధిస్తున్నారు. దీంతో ఆ బాలిక తన కుటుంబసభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ బాలికకు న్యాయం చేయాల్సింది పోయి, ఆమెను అభ్యంతరకరంగా ప్రశ్నించాడు. సూటిపోటి మాటలతో వేధించాడు. ‘ఈ ఉంగరం ఎందుకు పెట్టుకున్నావ్..? నెక్లెస్ ఎందుకు వేసుకున్నావ్..? నువ్వు చదువుకోలేదు. మరి అన్ని నగలు ఎందుకు పెట్టుకున్నావ్..? దాని వల్ల ఉపయోగం ఏంటీ? ఇదంతా చూస్తేనే అర్థమవుతోంది నువ్వెంటో..’ అంటూ అసహ్యంగా మాట్లాడాడు. అడ్డు చెప్పేందుకు ప్రయత్నించిన బాలిక తల్లిదండ్రులతో కూడా దురుసుగా ప్రవర్తించాడు. దీనినంతా బాలిక సోదరుడు మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు సదరు హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియోను ప్రియాంక గాంధీ ట్విటర్ ద్వారా పోస్టు చేస్తూ యూపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాలికతో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరిది. ఓవైపు ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు ఏ మాత్రం తగ్గడం లేదు. మరో వైపు చట్టాల్ని కాపాడాల్సిన పోలీసులే బాధితులతో ఇలా ప్రవర్తిస్తున్నారు’ అని ప్రియాంక ట్వీటర్‌లో విమర్శలు చేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos