ఉద్యోగ కల్పనలో కానరాని పురోగతి

ఉద్యోగ కల్పనలో కానరాని పురోగతి

న్యూఢిల్లీ : దేశంలో ఉద్యోగ కల్పనలో వృద్ధి కన్పించడం లేదు. ఫలితంగా ప్రజలు స్వయం ఉపాధికి దారులు వెతుక్కుం టున్నారు. మరికొందరు మహిళలు కుటుంబంలో జీతం భత్యం లేని వెట్టి చాకిరీ చేస్తున్నారు. మరోవైపు గత ఐదు సంవత్సరాల కాలంలో కార్మికుల వాస్తవ వేతనాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా స్థిరంగా ఉన్నాయి. న్యాయం, సామరస్యం, రాజ్యాంగ విలువల కోసం కృషి చేస్తున్న పౌర సమాజ బృందం ‘బహుత్వ కర్నాటక’ ఉపాధి, వేతనాలు, అసమానతల పేరిట రూపొందించిన నివేదికలో ఈ విషయాలను తెలియజేసింది. కుటుంబంలో వేతనాలు అనే ఊసే లేకుండా మహిళలు రాత్రింబవళ్లూ కష్టపడాల్సి వస్తోంది. ఉద్యోగావకాశాలు లభించకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇలాంటి వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఐదేండ్ల క్రితం ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ఇలా ‘ఉచితం’గా ఇంటి చాకిరీ చేసే వారు. ఇప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరు అలా చేయాల్సి వస్తోంది. కుటుంబంలో వేతనాలు లేకుండా పని చేస్తున్న వారిని అంతర్జాతీయ కార్మిక సంస్థ కుటుంబ కార్మికులకు సహాయకారులుగా అభివర్ణిం చింది. కుటుంబంలో ఎవరైనా దుకాణమో లేదా వ్యాపారమో నిర్వహిస్తుంటే వారికి చేదోడువాదోడుగా ఉండడమే వీరి పని. ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా వేతనమంటూ ఉండదు. కొందరు మహిళలు కుటుంబంలో ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే వారికి సహాయపడుతూ ఉంటారు. అయితే వీరికి కూడా వేతనమంటూ ఏదీ ఉండదు. అంటే వీరు చేసే పనికి వేతనమో లేదా జీతమో ఉండదన్న మాట.
తృణమో ఫణమో…అంతే
ఇలాంటి వారికి అప్పుడప్పుడూ తృణమో ఫణమో లభిస్తూ ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న కుటుంబ సభ్యులు అరుదుగా వీరికి కొంత సొమ్ము ఇస్తుంటారు. వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు కూడా వీరి చేతిలో డబ్బు పెడతారు. అయితే వ్యాపారానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలలో వీరి పాత్ర ఏమీ ఉండదు. వీరు చేసే పనిని ఉద్యోగంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ గుర్తించదు. వ్యవసాయంలో, కుటుంబాలు నిర్వహించే వ్యాపారంలో సాయపడే మహిళా సభ్యులు ఈ కేటగిరీ కిందికి వస్తారు.
వాస్తవాల దూరంగా నిటి ఆయోగ్ నివేదిక
2011-12లో 22 శాతంగా ఉన్న పేదరికం 2022-23 నాటికి 5% తగ్గిందని నిటి ఆయోగ్ చెబుతోంది. అయితే ‘బహుత్వ కర్నాటక’ సంస్థ ఇచ్చిన నివేదిక దీనికి భిన్నంగా ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్), ఉపాధి-నిరుద్యోగ సర్వే (ఇప్పుడు చేయడం లేదు) నుండి తీసుకున్న సమాచారాన్ని క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు. 2014లో అధికారంలోకి రావడానికి ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే 2022-23లో 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పట్టభద్రుల్లో 42% మంది నిరుద్యోగులుగానే ఉన్నారని ఈ నివేదిక చెబుతోంది. గత ఏడాది కూడా పట్టభద్రుల్లో నిరుద్యోగుల స్థాయి అధికంగానే ఉన్నదని నివేదిక రచయితల్లో ఒకరైన విద్యావేత్త రాజేంద్రన్ నారాయణన్ తెలిపారు.
స్వయం ఉపాధి వెదుకుతూ..
2011-12, 2022-23 మధ్యకాలంలో కార్మికుల్లో స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. 2011-12లో దేశంలోని కార్మికుల్లో పురుషుల్లో 51.5 శాతం, మహిళల్లో 56.5 శాతం స్వయం ఉపాధి పొందిన వారే. వీరి సంఖ్య 2022-23 నాటికి 53.4 శాతం, 64.3 శాతానికి పెరిగింది. పేద కుటుంబాల ఆదాయాల్లో ఏ మాత్రం పెరుగుదల లేకుండా స్థిరంగా ఉండడంతో మహిళలు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం లేకున్నా వ్యవసాయంలోనో లేదా దుకాణాల్లోనో సహాయకారులుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని నివేదిక తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos