ఉపా కింద బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపచేయలేరు

ఉపా కింద బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపచేయలేరు

చెన్నై : చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) 1967 కింద బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేయలేమని మద్రాసు హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. నిషేధిత సంస్థ కోసం ఆ ఖాతాల్లోని నిధులు ఉపయోగిస్తున్నారు లేదా వాటి కోసం నిర్దేశించబడ్డాయని కేంద్రం విచారణ ద్వారా రుజువు చేసుకుంటే తప్ప ఆ ఖాతాలను ఉపా కింద స్తంభింప చేయలేరని కోర్టు పేర్కొంది. చెన్నైకి చెందిన తమిళనాడు డెవలప్మెంట్ ఫౌండేషన్ ట్రస్టు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను స్తంభింప చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఎం.ఎస్.రమేష్, జస్టిస్ సుందర్ మోహన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు రూలింగ్ జారీ చేసింది. యుఎపిఎ కింద నిషేధించబడిన సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)కి ఈ ఖాతాల ద్వారా సహాయమందిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటువంటి నిషేధాజ్ఞపు ఆదేశాలు జారీ చేయడానికి ముందుగా అనుసరించాల్సిన విధి విధానాలను యుఎపిఎ లోని సెక్షన్ 7(1) నిర్దేశిస్తోందని, అసలు ఇటువంటి నిధుల వినియోగాన్ని నిషేధించే అధికారాన్ని సెక్షన్ 7 కేంద్రానికి ఇస్తోందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అయితే వీటికి ముందుగా సక్రమమైన విచారణ లేదా దర్యాప్తు జరగాల్సి వుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత కేసులో కేంద్ర ప్రభుత్వం ఆ రీతిలో వ్యవహరించ లేద న్నారు. కానీ డిజిటల్ పరికరాల నుండి స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలపై ఆధారపడి ఈ చర్యలకు పాల్పడిందని వారు పేర్కొన్నారు. ఆ పత్రాల్లో పిఎఫ్ఐ పేరు ఒక్కటే వుంది కానీ పిటిషనర్ ట్రస్టు పేరు లేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos