తెలంగాణ జలాశయాలకు వరద ఉధృతి

తెలంగాణ జలాశయాలకు వరద ఉధృతి

హైదరాబాద్‌ : భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జయశంకర్‌ భూపాలపల్లిలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గేట్లను తెరిచి ఉంచారు. 5.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అంతే మొత్తాన్ని కిందకు వదులుతున్నారు. అన్నారం జలాశయం శుక్రవారం మధ్యాహ్నానికే నిండిపోయింది. ఈ బ్యారేజీ నుంచి 36 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. నిర్మల్‌ జిల్లా కడెం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. దరిమిలా నాలుగు గేట్లు తెరిచి 39 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కడెం నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. మరో వైపు ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో భద్రాచలంలో ఉధృతి పెరిగింది. నీటి మట్టం 43 అడుగులకు చేరింది. స్నాన ఘట్టాల మీదుగా వరద నీరు ప్రవహిస్తుండడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. చత్తీస్‌గఢ్‌ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో తాలిపేరు జలాశయంలోని 34 గేట్లను ఎత్తివేసి 1.34 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos