ప్రధాని పదవిలో ఏడు గంటలే…!

ప్రధాని పదవిలో ఏడు గంటలే…!

డెన్మార్క్ : స్వీడన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టించిన మగ్దలీనా ఆండర్సన్ ఆ పదవిని చేపట్టిన కాసేపటికే రాజీనామా చేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవడంతోపాటు, ఆమె నేతృత్వం వహిస్తున్న కూటమి నుంచి గ్రీన్స్ పార్టీ వైదొలగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఆమె రెండు పార్టీలతో కలిసి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంటులో తిరస్కరణకు గురి కాగా, ప్రతిపక్షం ప్రతిపాదించిన బడ్జెట్‌కు అనుకూలంగా 154 ఓట్లు, ప్రతికూలంగా 143 ఓట్లు లభించాయి. దీంతో ఆండర్సన్ నేతృత్వంలోని సోషల్ డెమొక్రాటిక్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి వైదొలగడమే మంచిదని నిర్ణయించుకుంది. దీంతో ఆమె ప్రధాన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. ఆ పదవిలో ఆమె సుమారు 7 గంటలపాటు మాత్రమే ఉన్నారు.
ఆండర్సన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇది గౌరవానికి సంబంధించిన విషయమని చెప్పారు. ప్రభుత్వ చట్టబద్ధతను, నియమబద్ధతను ప్రశ్నించే పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడపటం తనకు ఇష్టం లేదన్నారు. ప్రభుత్వం నుంచి వైదొలగాలని సంకీర్ణ ప్రభుత్వంలోని ఓ పార్టీ నిర్ణయించుకుంటే, ఆ సంకీర్ణ ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos