హోసూరులో వంద కోట్లతో రోడ్లు విస్తరణ పనులు

హోసూరులో వంద కోట్లతో రోడ్లు విస్తరణ పనులు

హోసూరు పట్టణంలో వందకోట్ల ఖర్చుతో రోడ్లు విస్తరణతో పాటు ఫ్లై ఓవర్లను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. హోసూరు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందడంతో పట్టణంలో జన సాంద్రత కూడా బాగా పెరిగి వాహన రాకపోకలు ఎక్కువయ్యాయి. పట్టణంలో వాహన రాకపోకలు పెరగడంతో రద్దీని తగ్గించేందుకు అధికారులు నానా తిప్పలు పడుతున్నా హోసూరులో ఇరుకైన రోడ్లే ఎక్కువగా ఉన్నందున అధికారులు కూడా
ఏమిచేయలేక పోతున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హోసూరుకు మహానగరం హోదా లభించినా దానికి తగ్గట్టు హోసూరు పట్టణంలో ప్రాథమిక వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు కూడా విఫలమయ్యారని చెప్పాలి. హోసూరు పట్టణంలో భూగర్భ మురికి కాల్వల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, ఆ పనులు ఇప్పటికి ప్రారంభానికి నోచుకోలేదు. ఇదిలా ఉండగా హోసూరు పట్టణంలో అమృత్ పథకం ద్వారా 24 గంటలూ తాగునీరు సరఫరా చేసేందుకు పలుచోట్ల ట్యాంకులు నిర్మిస్తున్నారు. అదేవిధంగా పట్టణంలో రోడ్ల విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా హోసూరు ఆర్సి చర్చ్ నుండి తళి రైల్వే గేట్ వరకు 6 లైన్ల రోడ్డు, రైల్వే గేటు వద్ద నాలుగు వైపులా ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు నిధులు కేటాయించింది. అందులో భాగంగా రైల్వే శాఖ, తమిళనాడు రాష్ట్ర రహదారులు, ప్రజాపనుల శాఖలకు చెందిన 20 మంది ఉన్నత అధికారులు తళి రైల్వే గేటు జంక్షన్ వద్దకు వచ్చి ఆప్రాంతాన్ని పరిశీలించారు.త్వరలో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ల నిర్మాణం పనులు చేపట్టనున్నట్లు అధికారుల బృందం తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos