సాయంపై ప్రచారమా! రామచంద్రన్ ఆవేదన

సాయంపై ప్రచారమా! రామచంద్రన్ ఆవేదన

హొసూరు : లాక్ డౌన్ కారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పేదోళ్లకు చేస్తున్న సహాయాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటున్నారని తళి మాజీ ఎమ్మెల్యే టి. రామచంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. తమిళనాడులో కూడా లాక్ డౌన్ కొనసాగుతున్నందున ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అటు ప్రభుత్వం  చర్యలు చేపడుతుండగా, మరోపక్క వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థలకు చెందినవారు పేద ప్రజలను ఆదుకుంటున్నారు. హొసూరు ప్రాంతంలో లాక్ డౌన్ కారణంగా వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు మూతపడడంతో ప్రజలకు నిత్యావసర వస్తువులు దొరకడం కష్టంగా మారింది. ఏడీఎంకే, డీఎంకే పార్టీ నాయకులే కాక స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు నిత్యావసర సరుకులను నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు. హొసూరు మాజీ ఎమ్మెల్యే లు గోపీనాథ్,  రామచంద్రన్ తదితర నాయకులు ప్రచార పటాటోపం లేకుండా పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పార్టీ నాయకులు పేదలకు సహాయ పడుతున్నది కూడా రాజకీయ ప్రయోజనాలకే నని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా తళి మాజీ ఎమ్మెల్యే టి. రామచంద్రన్ పేదలకు పంచుతున్న నిత్యావసర వస్తువుల పెట్టెలపై రాజకీయ ప్రయోజనాలకు కాదు, పేదల ఆకలి తీర్చేందుకే అని రాసి ఉన్న స్టిక్కర్లు అతికించి ఆయన నియోజకవర్గంలో  పంచుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఏడీఎంకే, డీఎంకే పార్టీలకు చెందిన నాయకులు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ  రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఈ సందర్భంగా రామచంద్రన్ అన్నారు  హొసూరు ప్రాంతంలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు పోటీ పడుతూ పేదలకు  నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నది కూడా రాజకీయంలో భాగమే తప్ప ఆదుకోవాలనే ఉద్దే శంతో కాదని రామచంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఆకలి తీర్చే విషయంలో కూడా ప్రధాన పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఎగబడటం మంచిది కాదని ఆయన హితవు పలికారు.  నిస్వార్థంగా పేదలకు సహాయ పడితే ప్రజలు నాయకులను అక్కున చేర్చుకొంటారని ఆయన అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos