పొంతన లేని ప్రకటనలతో మభ్యపుచ్చే యత్నాలు

పొంతన లేని ప్రకటనలతో మభ్యపుచ్చే యత్నాలు

న్యూఢిల్లీ : రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ మద్దతిస్తూనే వచ్చిందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రిజర్వేషన్లకు ఆరెస్సెస్ వ్యతిరేకమంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలపై ఆయన వివరణ ఇస్తూ, రాజ్యాంగం ఇవ్వజూపిన అన్ని రకాల రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతును ఇస్తుందన్నారు.. సమాజంలో అసమానతలు ఉన్నంతవరకు ఈ రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని ఆయన సోమవారం చెప్పారు.
ఆ వీడియోలు బూటకమని అన్నారే కానీ, అందులోని సమాచారం నిజం కాదని గట్టిగా ఆయన చెప్పలేక పోయారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపుచ్చేందుకు ఆరెస్సెస్, బిజెపి నేతలు ఇటువంటి ప్రకటనలు చేస్తుంటారు. మోహన్ భగవత్ ఇప్పుడు చెబుతున్న మాటలకు గతంలో ఆరెస్సెస్కు చెందిన పలువురు సీనియర్ నాయకులు చేసిన ప్రకటనలకు ఎక్కడా పొంతనే కుదరడం లేదు. పలు సందర్బాల్లో పలువురు ఆర్ఎస్ఎస్ నేతలు రిజర్వేషన్లపై ఏమన్నారో చూడండి..

*మన్మోహన్ వైద్య, 2017 : ‘రిజర్వేషన్లకు అంతం పలకాలి’
2017 జనవరిలో ఆర్ఎస్ఎస్కు అప్పట్లో పబ్లిసిటీ చీఫ్గా, ప్రస్తుతం సంయుక్త ప్రధాన కార్యదర్శిగా వున్న మన్మోహన్ వైద్య ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘ఒక భిన్నమైన సందర్భం’లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని, వాటికి కచ్చితంగా ఒక ‘కాల పరిమితి’ వుండాలని అన్నారు. ‘చారిత్రకంగా జరిగిన అన్యాయానికి చికిత్సగా రాజ్యాంగం రిజర్వేషన్లను అందించింది. అది మన బాధ్యత. రాజ్యాంగం ఏర్పడిన నాటి నుండి వారికి రిజర్వేషన్లు వున్నాయి. కానీ, వీటిని శాశ్వతంగా కొనసాగించడం మంచిది కాదని అంబేద్కర్ కూడా అన్నారు. దీనికి ఒక కాలపరిమితి వుండాలి.’ అని వైద్య పేర్కొన్నారు. జైపూర్ సాహితీ ఉత్సవాల్లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రిజర్వేషన్లను ఇలాగే ఎప్పటికీ కొనసాగించడం వల్ల మతోన్మాదం పెరుగుతుంది’ అన్నారు.
*కె.ఎన్.గోవిందాచార్య, 2016 : ‘రాజ్యాంగాన్ని రిజర్వేషన్లకే పరిమితం చేయరాదు’
2016లో వైర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికవేత్త కెఎన్ గోవిందాచార్య మాట్లాడుతూ రాజ్యాంగానికి కొత్త చట్రపరిధిని రూపొందించాల్సి వుందన్నారు. ”రిజర్వేషన్లు కొంతవరకు సాయపడవచ్చు, భావోద్వేగంగా కూడా ముఖ్యమే కావచ్చు. కానీ ప్రజలకు సాయపడేలా ఇంకా ఏం చేయగలమో మనం చర్చించాలి.” అన్నారు. ”మన రాజ్యాంగం చాలా అస్పష్టంగా వుంది. నిర్దిష్టంగా లేదు, మౌలికంగా పశ్చిమ దేశాల సిద్ధాంతాల కొనసాగింపుగా వుంది. వ్యక్తి కేంద్రంగా, వారి సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించింది. మన నాగరితక నాలుగైదు వేల ఏళ్లనాటిది.”అని పేర్కొన్నారు. కొత్త రాజ్యాంగం అవసరమనే తన వాదనను సమర్ధించుకునేయత్నంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
*ఎం.జి.వైద్య, 2015 : ‘ఇప్పుడు రిజర్వేషన్లు అవసరం లేదు’
2015లో ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికవేత్త ఎం.జి.వైద్య ‘ది హిందూ’తో మాట్లాడుతూ, రిజర్వేషన్లను రద్దు చేయాలన్నారు. ‘ఇప్పుడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అవసరం లేదు. ఎందుకంటే ఏ కులం కూడా వెనుకబడి లేదు. అన్నింటికంటే ముఖ్యంగా, ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్లు పదేళ్లే కొనసాగించాలి. ఆ తర్వాత కుల ప్రాతిపదిక రిజర్వేషన్ను పూర్తిగా రద్దు చేయాలి.” అన్నారు. కుల ప్రాతిపదిక రిజర్వేషన్ వల్ల కులాల విభజనలు పూర్తిగా పారద్రోలడానికి బదులుగా మరింత బలపడుతున్నాయన్నారు.
*మోహన్ భగవత్, 2015 : ‘రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలి’
రాజకీయ ప్రయోజనాల కోసమే రిజర్వేషన్ విధానాన్ని వాడుతున్నారని, అందువల్ల దాన్ని సమీక్షించాల్సి వుందని 2015లో మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ”సామాజిక న్యాయానికి కట్టుబడినవారు, యావత్ దేశ ప్రయోజనాల కోసం నిజాయితీగా ఆందోళన చెందే వ్యక్తులు సహా సమాజంలోని కొంతమంది ప్రతినిధులతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ కేటగిరీలకు, ఎంతకాలం రిజర్వేషన్లు అవసరమో నిర్ణయించాలి.” అని అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి గల కమిషన్లు వంటి రాజకీయేతర కమిటీలకు దీని అమలు బాధ్యత అప్పగించాలి.. ఆ కమిటీలు నిజాయితీగా, సమగ్రతతో పనిచేస్తున్నాయో లేదో రాజకీయ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.
2019లో ఆయన తన వైఖరేమిటన్నది స్పష్టంగా చెప్పలేదు కానీ రిజర్వేషన్లకు అనుకూలమైనవారు, వాటిని వ్యతిరేకించే వారి మధ్య సామరస్య వాతావరణంలో చర్చలు జరగాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos