పన్నూన్‌ హత్యాయత్నం వెనుక ‘రా’ ప్రమేయం

పన్నూన్‌ హత్యాయత్నం వెనుక ‘రా’ ప్రమేయం

న్యూ ఢిల్లీ: సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పై అమెరికాలో జరిగిన హత్యాయత్నం కుట్రలో భారత గూఢచార సంస్థ ‘రా’ ప్రమేయం ఉందంటూ వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ చర్యకు అప్పటి భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ సామంత్ గోయెల్ సైతం అనుమతి తెలిపినట్లు అమెరికా నిఘా సంస్థలు అంచనా వేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. అయితే ఈ ప్రయత్నాన్ని అమెరికా నిఘా సంస్థలు అడ్డుకున్నాయని తెలిపింది. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా గురుపత్వంత్ను హతమార్చే పథకం గురించి తెలుసునని.. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను అమెరికా సంస్థలు కొంతమేరకు సేకరించినట్లు పేర్కొంది. అయితే, ఈ కథనంపై భారత్ తీవ్రంగా స్పందించింది. వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనాన్ని నిరాధారమైనదిగా అభివర్ణించింది.ఈ మేరకు ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సమాధానమిచ్చారు. ఓ సున్నితమైన అంశంపై ఆ నివేదిక నిరాధారమైన, అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. టెర్రరిస్టు నెట్ వర్క్లకు సంబంధించి అమెరికా ప్రభుత్వం అందించిన భద్రతా పరమైన సమస్యలను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విచారిస్తోందని తెలిపారు. ఊహాజనిత, బాధ్యతారహిత మైన కథనాల వల్ల ఉపయోగం ఉండబోదని తెలిపారు. కాగా, పన్నూన్ అమెరికాలో సిక్కు ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్గా ఉన్నారు. భారత ప్రభుత్వం గతంలో ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos