ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం ఈడేరుస్తుంది

ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం ఈడేరుస్తుంది

న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ భరోసా ఇచ్చారు. గురువారం పార్లమెంట్ ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించారు. ‘17వ లోక్‌సభలో చాలా మంది ఎంపీలు కొత్తవారే. మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. నవ భారత నిర్మాణానికి ఇదే నిదర్శనం’ అని అభివర్ణించారు. ‘బహిరంగ, అంతర్గత ముప్పుల నుంచి దేశానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. 2022 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతుంది. నవ భారత నిర్మాణం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. రైతుల, జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తాము.నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. జల్ శక్తి మంత్రిత్వ శాఖే ఇందుకు నిదర్శనం. ప్రజలందరి జీవన స్థితిగతులు మారుస్తాం. గ్రామీణ ప్రాంతాలకు పూర్థిస్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. యువతకు మంచి విద్యావకాశాల కల్పనకు మరిన్ని కోర్సులు తీసుకొస్తాం. యువ భారత్‌ స్వప్నాలు సాకారం చేస్తాం. నివాస, వైద్య సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సాధికారతతోనే పేదరికాన్ని నిర్మూలించగలం. రైతులు, చిన్న వ్యాపారుల భద్రత కోసం ప్రభుత్వం పింఛను పథకం తీసుకొచ్చింది. గ్రామీణ క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం. క్రీడల్లో ప్రతిభా వంతులను గుర్తించేందుకు కొత్త విధానాలను తీసుకొస్తాం. క్రీడాకారులకు ఆధునిక శిక్షణ అందిస్తాం. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ నిధి కింద మూడు నెలల్లో రూ. 12వేల కోట్లు ఇచ్చాం. 40ఏళ్లు దాటిన రైతులకు పింఛను ఇస్తాం. మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మహిళలకు సమాన హక్కులు కల్పించాలంటే ముమ్మారు తలాక్‌, నిఖా హలాలా వంటి పద్ధతులను తొలగించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తాం. జీఎస్టీని మరింత సరళీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజారవాణాను మెరుగు పరచడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఒకే దేశం-ఒకే రవాణా కార్డు సదుపాయం ఏర్పాటుపై పరిశీలనలు చేస్తున్నాం. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. అక్రమ వలసదారులు దేశ భద్రతకు ముప్పు. అందుకే సరిహద్దుల్లో భధ్రతను పెంచుతాం. జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ ప్రక్రియను కూడా కొనసాగిస్తాం. 2024 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికశక్తిగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యం. భారత అంతరిక్ష సామర్థ్యం, దేశ భద్రతా సన్నద్ధతలో ‘మిషన్‌ శక్తి’ సరికొత్త అధ్యాయం. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా ఉన్నాయి. మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడమే దీనికి రుజువు. దేశ భద్రతే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. ఉగ్ర శిబిరాలపై సర్జికల్‌ దాడులు, వైమానిక దాడులు ఉగ్రవాదం పట్ల భారత్‌ తీరును స్పష్టం చేస్తున్నాయి ’అని పేర్కొన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos