ఎక్కడున్నారు దొరా …?

ఎక్కడున్నారు దొరా …?

హొసూరు : కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని వ్యవస్థలు స్తంభించాయి. కొన్ని రాష్ట్రాలలో ప్రజలు అడపాదడపా బయటకు వస్తున్నా చాలా రాష్ట్రాలలో ప్రజలు ఇళ్లకే పరిమితమైయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో కృష్ణగిరి జిల్లా మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎవరూ బయటకు రావడం లేదు. ఇదిలా ఉండగా కరోనా ప్రభావంతో నిత్యావసర సరుకులకు ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినా మరో పక్క రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలే కాక దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలకు అందజేస్తున్నారు. కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా రాజ్యసభ సభ్యుడు కెపి.మునిస్వామి సుడిగాలి పర్యటన చేసి పేదలకు టన్నుల కొద్దీ నిత్యావసర సరుకులు పంపి ణీ చేస్తుండగా మరో పక్క మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి కూడా టన్నుల కొద్దీ నిత్యావసరాలను పంచుతున్నారు. ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులే కాక చోటా మోటా నాయకులు కూడా నిత్యావసరాలు పేదలకు పంచుతూ మేము సైతం అంటూ ముందుకు వచ్చి ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు. కానీ కృష్ణగిరి జిల్లాలో రాజకీయంగా ఎదిగిన మరో ప్రముఖ నాయకుడు, మాజీ డిప్యూటి స్పీకర్ తంబిదురై జాడ మాత్రం జిల్లాలో ఎక్కడా కనిపించలేదని స్థానికుల్లోనే కాక ఎడిఎంకె పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. కృష్ణగిరి జిల్లాలో మెట్రిక్  నుండి మెడికల్ కాలేజీలవరకు ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించారు.ఆయన విద్యాసంస్థలలో చదువుతున్న 65 శాతం మందికి పైగా హోసూరు,చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారే.హోసూరు ప్రాంతంలో కూలి పనులు చేసే పేదోళ్లు సైతం లక్షల్లో పీజులు చెల్లించి తమ పిల్లలను దొరగారి కాలేజీలలో,పాఠశాలల్లో చదివిస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం పేదలు ఇళ్లకే పరిమితమై నానా అవస్థలు పడుతున్న తరుణంలో కూడా దొరగారు బయటకు రాకపోవడంతో స్వంత పార్టీలో గుసగుసలు మొదలైయ్యాయి.జిల్లా వ్యాప్తంగా స్వంత పార్టీ నాయకులు పోటీ పడి పేదలకు నిత్యావసర వస్తువులను పంచుతున్నా, కనీసం ఆ కార్యక్రమంలో తంబిదురై పాల్గొనకుండా ఇంటికే పరిమితం కావడంపై జిల్లా వ్యాప్తంగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన దొరగారు కష్టకాలంలో కూటికి లేని పేదలకు పిడికెడు బియ్యం కూడా ఇవ్వకపోవడం విడ్డూరమని స్థానిక ప్రజలు గుసగుసలాడుకొంటున్నారు.ఎంజీఆర్ హయాం నుండి నేటివరకు జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన తంబిదురై కష్టకాలంలో కూడా బయటకు రాకపోవడం మంచిధి కాదని, పార్టీలో ఆయనపై మర్యాద తగ్గే ప్రమాదం కూడా లేకపోలేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దొరగారు బయటకు రాకపోవడంపై కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా వివిధ రకాలుగా గుసగుసలు వినపడుతున్నాయి. ఇకనైనా తంబిదుర్తె జిల్లా వ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు బయటకు వస్తారా అని వేచి చూడాల్సిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos