పరిటాల కుటుంబానికి భద్రత పెంచిన జగన్

పరిటాల కుటుంబానికి భద్రత పెంచిన జగన్

అనంతపురం : ప్రభుత్వం మారిన నేపథ్యంలో పరిటాల కుటుంబం తమ భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఎప్పుడేం జరుగుతుందోనని కలవరం చెందుతోంది. అయితే వారి భయాలను పటాపంచలు చేస్తూ కాబోయే ముఖ్యమంత్రి జగన్‌, ఆ కుటుంబానికి భారీగా భద్రతను కల్పించే ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఆయనింకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ అధికార యంత్రాంగం ఆయన మనోభావానికి అనుగుణంగా చర్యలు చేపడుతోంది. పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురంలో తమ కుటుంబ భద్రతపై మంగళవారం ఆందోళన వ్యక్తం చేసిన గంట వ్యవధిలో వారికి గన్‌మెన్‌ సంఖ్యను భారీగా పెంచారు. ఎనిమిది మంది అదనపు గన్‌మెన్‌ను నియమిస్తూ కర్నూలు రేంజ్‌ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు సునీత, ఆమె కుమారుడు శ్రీరాములు వెంకటాపురంలో విలేకరులతో మాట్లాడారు. తమ కుటుంబ భద్రత మీద అనుమానాలు వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో తెదేపా కార్యకర్తలు, నాయకులు భయపడాల్సిన పని లేదని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమేనని, అంతమాత్రానికే భయపడరాదని ధైర్య వనచాలు పలికారు. గ్రామాల్లో గొడవలు సృష్టించడానికి వైకాపా నాయకులు ప్రయత్నించే అవకాశాలున్నాయని, అలాంటి సందర్భాల్లో సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. కాగా శాసన సభ ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి సునీత పోటీ చేయకుండా తనయుడు శ్రీరాములుకు అవకాశం కల్పించారు. ఆయన సుమారు 40 వేల ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos