మిల్లెట్స్ మణి

మిల్లెట్స్ మణి

అన్నిసార్లూ జీవితం మనం అనుకున్నట్టు ఉండదు. ఎన్నో ఒడిదొడుకులు… ఊహించని సమస్యలు ఇబ్బంది పెట్టేస్తుంటాయి. అలాంటి కష్టాలన్నింటినీ సమర్థంగా     దాటుకుని…  తనకంటూ ఓ ఉనికి ఏర్పరచుకుంది ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మణి. ఒంటరి తల్లిగా కూతురిని పెంచి పెద్ద చేయడమే కాదు… చిరుధాన్యాల మొలకల పిండితో   రకరకాల పదార్థాలు, రెడీ టు మిక్స్‌లు తయారు చేస్తోంది.

నేను పెద్దగా చదువుకోలేదు. అలాగని గొప్ప జీవితం కూడా ఊహించుకోలేదు. అందుకేనేమో నా జీవితాన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూలంగా మలుచుకున్నా. అసలేం జరిగిందంటే… మాది ఖమ్మం జిల్లా వైరా. నాకు చిన్నతనంలోనే పెళ్లైంది. వెంటనే పాప పుట్టింది. ఆయన వృత్తిరీత్యా మేం హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. అయితే ఆయనకీ నాకూ వయసులో చాలా తేడా ఉంది. దానికితోడు మరికొన్ని కారణాలు, పరిస్థితుల వల్ల ఒంటరిదాన్నయ్యా. అప్పుడు నా వయసు కేవలం పద్దెనిమిదేళ్లే. నాకు తోడు పాప. సమస్యలు ఎదురైనా నా బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే లక్ష్యం అనుకున్నా.

ఎవరికీ భారం కాకుండా…
నాకు ఆత్మాభిమానం ఎక్కువ. పుట్టింటి వాళ్లపై ఆధార పడదల్చుకోలేదు. అందుకే హైదరాబాద్‌లోనే ఉండిపోయా. చిన్నతనంలోనే కుట్లు, అల్లికలు నేర్చుకున్నా కాబట్టి ఆ కళల్ని జీవనోపాధిగా ఎంచుకున్నా. అప్పట్లో వాటికి బాగా ఆదరణ ఉండేది. ఇంట్లోనే చుట్టుపక్కల మహిళలకు నేర్పించేదాన్ని. పాప స్కూల్‌కి వెళ్లడం మొదలుపెట్టాక పోచంపల్లికి దగ్గర్లో ఉన్న రామానంద తీర్థ ఇనిస్టిట్యూట్‌లో పెయింటింగ్‌ నేర్చుకున్నా. శిక్షణ పూర్తయ్యాక దాన్ని ఉపాధిగా మార్చుకున్నా. కొన్నాళ్ల తరువాత జేఎన్‌టీయూలో టైలరింగ్‌, ప్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో శిక్షణ తీసుకున్నా. సర్టిఫికెట్‌ వచ్చింది. ఎప్పటికప్పుడు మనం అప్‌డేట్‌ కాకపోతే మార్పులను తట్టుకుని నిలబడటం సాధ్యం కాదనేది నా అభిప్రాయం. అందుకే నన్ను నేను ఎప్పుడూ అప్‌డేట్‌ చేసుకోవాలని అనుకుంటా. సవాళ్లు, సమస్యలు ఎదురైనా… కూతుర్ని పెంచే క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడినా… అన్నింటినీ మౌనంగానే భరించా. ఎన్నో అంశాల్లో శిక్షణ తీసుకున్న నేను చిరుధాన్యాల వైపు రావడానికి కారణం మా ఇంటి వాతావరణమే. మా ఇంట్లో వాటిని ఎక్కువగా వాడేవాళ్లం. మా అమ్మమ్మ వాటి గురించి పదే పదే చెబుతుండేది. మా తమ్ముడు జర్మనీలో ఉండేవాడు. వాడికోసం నేను జావపిండి, రెడీ మిక్స్‌లు తయారు చేసి పంపేదాన్ని. మా తమ్ముడి దగ్గర వాటిని చూసిన వాళ్లు తమకూ కావాలని అడిగేవారట. దాంతో నేను మళ్లీ తయారుచేసి కొరియర్‌లో పంపించేదాన్ని. అయితే వాటికి డబ్బులు తీసుకునేదాన్ని కాదు. క్రమంగా మా చుట్టుపక్కల వాళ్లు కూడా అడగడం మొదలుపెట్టారు. నేనొక్కదాన్నే అలా ఇవ్వడం సాధ్యం కాదు. పైగా ఖర్చు. అందుకే బాగా ఆలోచించి దీన్నో ఉపాధిగా మార్చుకోవాలని అనుకున్నా. అలా గతేడాది జొన్నలు, అరికెలు, సామలు, ఊదలు, సజ్జలు, అండుకొర్రల్ని కొని రోట్లో దంచి.. పిండి పట్టించి.. ప్రాసెస్‌ చేయించి రకరకాల పదార్థాలు తయారు చేయించేయడం మొదలుపెట్టా. నేరుగా చిరుధాన్యాల్లో కంటే మొలకల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని తెలిసింది. అప్పట్నుంచీ కాస్త కష్టమే అయినా గింజల్ని మొక్క కట్టిస్తూ పొడి తయారు చేస్తున్నా. ఆ పిండితో చెక్కలు, చక్రాలు, జంతికలు, లడ్డూలు, బూందీ, కజ్జికాయలు, బూరెలు… ఇలా రకరకాల పదార్థాలు తయారు చేశా. అలానే ఇడ్లీ, దోశ, రెడీమిక్స్‌లు, ఇడ్లీరవ్వ, దోశపిండి, చపాతీపిండి, చెక్కల పిండి, జావలు పిండి కూడా చేసి అమ్ముతున్నా.

విదేశాలకు ఎగుమతి…
నేను చేసిన పదార్థాలు చుట్టుపక్కల వాళ్లందరికీ బాగా నచ్చాయి. ఇంకా కావాలని అడిగేవారు. మా మేనమామల సాయంతో వైరాలోనే ఓ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశా. అక్కడ మొలకలు వచ్చిన చిరుధాన్యాలను పిండిగా చేయించి హైదరాబాద్‌ తెప్పించుకుంటా. మళ్లీ వాటిని ప్రాసెస్‌ చేసి రకరకాల పిండి పదార్థాలుగా మారుస్తా. అక్కడ యూనిట్‌ పెట్టడం వల్ల కార్మికులు, కొన్ని ఖర్చులు కలిసొచ్చాయి. నేను వీలున్నప్పుడల్లా వెళ్లొస్తుంటా. ముడిసరకు ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలు, నంద్యాల, రాయలసీమ నుంచి తెప్పించుకుంటా. నేను తయారు చేసినవి మా చుట్టుపక్కల వారికి, అమెరికా, లండన్‌, జర్మనీ, కెనడాలో ఉన్నవారికీ పంపుతున్నా. ఈ మధ్య అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. దాంతో చిరుధాన్యాలను తినడానికి ఆసక్తి చూపుతున్నారు. నాకు ఆర్డర్లు బాగానే వస్తున్నాయి. మరికొంత మార్కెటింగ్‌ చేయాల్సి ఉంది. ఒంటరిగా అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కాస్త కష్టమే. ఈ వ్యాపారం కోసం పదిలక్షల రూపాయల పెట్టుబడి పెట్టా. పలువురికి మేలు చేసే పదార్థాలు అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పుడిప్పుడే లాభాలు వస్తున్నాయి. మరోవైపు కూతుర్ని చదివించుకుంటూ బాగా చూసుకుంటున్నాననే ఆత్మసంతృప్తి ఉంది. ఇప్పుడు మా పాప డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తనూ కొన్ని పనుల్లో సాయం చేస్తుంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos