మాజీ క్రికెటర్‌ భార్యను దోచుకొన్న థక్‌థక్‌ గ్యాంగ్‌

మాజీ క్రికెటర్‌ భార్యను దోచుకొన్న థక్‌థక్‌ గ్యాంగ్‌

దిల్లీ: ప్రముఖ నటి, మాజీ క్రికెటర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ సతీమణి ఫర్హీన్‌ ప్రభాకర్‌ను దిల్లీలోని ఓ దొంగల ముఠా దోచుకొంది. దిల్లీలోని థక్‌ థక్‌ గ్యాంగ్‌కు చెందిన నలుగురు దోపిడీ దొంగలు ఆమెపై దాడి చేసి పర్సు, మొబైల్‌ ఫోన్లను అపహరించుకెళ్లారు. ఆమె దక్షిణ దిల్లీలోని ఒక మాల్‌కు వెళుతుండగా శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకొంది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగినప్పుడు నలుగురు దొంగలు వాహనంపై దాడి చేశారు. ఇదేమని ప్రశ్నించిన ఆమెను సరిగా డ్రైవ్‌ చేయమని దూషించారు. తర్వాత ఆమె పర్సు నుంచి రూ.16,000 నగదు, పత్రాలు, ఫోన్లను దోచుకొన్నారు. అనంతరం వారు దాడి చేయడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించారు. దీంతో ఆ దొంగలు మరో లైన్లో అప్పటికే పార్క్‌ చేసి ఉంచిన కారులో ఉడాయించారు. కొన్నాళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్న ఫర్హీన్‌  ఈ ఘటనతో రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. ఆ మార్గంలో వెళుతున్న ఒక సైనికాధికారి ఆమెకు సాయం చేశారు. ఈ దోపిడీకి పాల్పడింది థక్‌థక్‌ గ్యాంగ్‌ సభ్యులుగా పోలీసులు గుర్తించారు.

ఈ థక్‌ థక్‌ గ్యాంగ్‌ కథేంటీ..

తెల్గీ కుంభకోణం దర్యాప్తులో భాగంగా వినోద్‌ అనే వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసి కేసు నమోదు చేసింది. నకిలీ స్టాంపులు విక్రయించినట్లు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఒక రేప్‌ కేసులో కూడా ఇతను నిందితుడు. జైలు నుంచి బయటకు వచ్చి సొంతంగా థక్‌ థక్‌ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. దీనిలో మరికొందరిని చేర్చుకొని దోపిడీలు మొదలు పెట్టాడు. ఈ గ్యాంగ్‌ దిల్లీలో విస్తరించింది. వీరు ఇనప గుండ్లను పంగలికర్రలతో ప్రయోగించి కార్ల అద్దాలు పగలగొట్టి దోపిడీలకు పాల్పడతారు.

మరికొన్ని సందర్భాల్లో కారు డ్రైవర్లను మభ్యపెట్టి వాహనం బయటకు వచ్చేలా చేసి దోచుకొంటారు. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో దాడులు కూడా చేస్తారు. పట్టుబడిన వారికి న్యాయ సహాయం చేసేందుకు పలువురిని ఈ గ్యాంగ్‌ ఏర్పాటు చేసుకొంది. ఈ గ్యాంగ్‌లో మహిళలు కూడా ఉన్నారు. వీరందరికి జనాన్ని మభ్యపెట్టి దొంగతనాలు చేయడంపై ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు.

ఇప్పటికే పోలీసులు ఈ గ్యాంగ్‌కు సంబంధించిన కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. కానీ మిగిలిన సభ్యులు దోపిడీలకు పాల్పడుతున్నారు. మార్చి 16వ తేదీన దిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ గ్యాంగ్‌కు చెందిన ‘గురుజీ’ ని పోలీసులు అరెస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos