స్థానిక ఎన్నికలపై విచారణ రేపు

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) ప్రకటించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎన్నికలను వాయిదా వేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. కరోనా వైరస్‌ ఆందోళన నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. అయినా ఎన్నికలను వాయిదా వేయడం సబబు కాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. స్థానిక ఎన్నికల వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ యథాతథంగా ఎన్నికలు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. మరోవైపు ఇదే అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేవియట్‌ దాఖలు చేసింది. తమ వాదన విన్న తర్వాతే ఆదేశాలు ఇవ్వాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదులు కేవియట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos