ఓట్లు పెరిగినా సీట్లు తగ్గాయి…కేటీఆర్

ఓట్లు పెరిగినా సీట్లు తగ్గాయి…కేటీఆర్

హైదరాబాద్‌ : ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రమైన సరళి కనబడిందని, తమ పార్టీకి ఓట్లు పెరిగినా సీట్లు తగ్గాయని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 34 శాతం ఓట్లతో 11 స్థానాలను గెలుచుకుంటే, ఇప్పుడు ఆరు శాతం ఓట్లు పెరిగినా తొమ్మిది సీట్లే వచ్చాయని తెలిపారు. పార్టీలో అందరూ కష్టపడినా ఫలితం మరోలా వచ్చిందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ గెలిచిన మూడు సీట్లకు గాను రెండింటిలో తెరాస స్వల్ప తేడాతో ఓడిపోయిందన్నారు. ఈ ఫలితాలు తమకు ఎదురు దెబ్బ కాదని, ప్రధానిగా నరేంద్ర మోదీ అభ్యర్థిత్వమే భాజపా ఓట్ల పెరుగుదలకు కారణమని విశ్లేషించారు. భాజపా కార్యకర్తలు లేని చోట్ల కూడా ఆ పార్టీకి ఓట్లు పడ్డాయన్నారు. ఆదిలాబాద్‌ సీటును గెలుస్తామని బహుశా భాజపా కూడా ఊహించి ఉండదన్నారు. డిసెంబరులో జరిగిన శాసన సభ ఎన్నికల్లో భాజపాకు మూడు వేల ఓట్లు పడితే, ఇప్పుడు 50 వేల ఓట్లు పడ్డాయని గుర్తు చేశారు. నిజామాబాద్‌లో కవిత ఓటమికి రైతులు కారణం కాదని అన్నారు. అక్కడ నామినేషన్లు వేసింది రైతులు కాదని, రాజకీయ కార్యకర్తలేనని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్‌ నేత ఇంటి నుంచి 93 నామినేషన్లు వచ్చి పడ్డాయన్నారు. కాంగ్రెస్‌, భాజపా కుమ్మక్కు వల్లే కవిత ఓడిపోయారని ఆరోపించారు. ఒక్క ఓటమితో కుంగిపోమని, తెలంగాణ, ఆంధ్రా మధ్య సత్సంబంధాలు ఉండాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos