మూడు జిల్లాలను ముంచెత్తిన వానలు

మూడు జిల్లాలను ముంచెత్తిన వానలు

చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే మళ్లీ వర్షాలు మొదలవ్వడం ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువులు నిండు కుండల్లా తొణికిసలాడుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు మళ్లీ జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఆదివారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మరోసారి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
తాజాగా తిరుమలకు రాకపోకలపై ఆంక్షలు విధించారు. ద్విచక్ర వాహనాలకు ఘాట్ రోడ్డులో అనుమతి లేదని టీటీడీ ప్రకటించింది. వర్షం ఆగిన సమయంలో నాలుగు చక్రాల వాహనాలను అనుమతిస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలను మూసి వేశారు. తిరుమల ఘాట్ రోడ్డులో అక్కడక్కడ కూలిన వృక్షాలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో భక్తులను అనుమతిస్తున్నారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు.
తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం డ్యాంల నుంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఆ నీరు తిరుపతిలోని కపిలతీర్థం నుంచి తిరుపతి నగరంలోని లోతట్టు ప్రాంతాలకు చేరుతోంది. శేషాచలం కొండల్లో నుంచి వచ్చే వరద నీరు కళ్యాణీ డ్యాంకు చేరుతుండడంతో నీటి విడుదల యథాతదంగా కొనసాగుతోంది. కలెక్టర్ హరినారాయణన్, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న అరణియార్, కాళంగి రిజర్వాయర్, కల్యాణి డ్యాం, రాయలచెరువును పరిశీలించారు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. అవసరమైతే దిగువ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని అంచనా వేసి.. ప్రజలకు, పంటలకు ఇబ్బంది లేకుండా దిగువకు వదలాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసే సమయంలో నెల్లూరు జిల్లా వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలను అప్రమత్తం చేశారు.  పల్లపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కొంత మంది భయంతో ముందస్తుగా ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు తరలిపోతున్నారు. చిత్తూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నవంబరులో 142.6 మి.మీ వర్షపాతం నమోదు కావలసి ఉండగా, రెండు పర్యాయాలు వచ్చిన తుపాను కారణంగా 438.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం
కోమరిన్ ప్రాంతం, శ్రీలంక పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంలో 30వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలుత ఇది 29వ తేదీనే ఏర్పడుతుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుతం బ్యాంకాక్ సమీపంలో ఉండడంతో అండమాన్ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం మన రాష్ట్రంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర ఉండే అవకాశం ఉందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos