ఏపీలో విదేశీయుల సంఖ్యపై అనుమానాలు..

ఏపీలో విదేశీయుల సంఖ్యపై అనుమానాలు..

కరోనా వైరస్‌ దేశంలో రోజురోజుకు తీవ్రతరమవుతుండడంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో రాకపోకలు పూర్తిగా స్తంబించాయి. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్రాలు సైతం ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలను,ప్రజలను తమ రాష్ట్రంలోకి అనుమతించడానికి నిరాకరిస్తుండడంతో ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోయారు.ఇక కరోనా కేసుల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిమేర తక్కువగానే ఉన్నా మరో కొత్త విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు మొదలయ్యాక యూరప్, అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి ఎన్నారైల రాక పెరిగింది. వీరిలో వందల మంది కరోనా పాజిటివ్ లక్షణాలతోనే దేశంలో అడుగుపెట్టారు. ఇదే క్రమంలో ఏపీలోనూ రెండు వారాల క్రితం 12 వేల మంది మాత్రమే విదేశాల నుంచి చేరుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పెట్టడంతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటికే ఢిల్లీతో పాటు ఇతర దేశీయ విమానాశ్రయాలకు చేరుకున్న వారు ఏపీకి వస్తూనే ఉన్నారు. ఇది మరో వారం కొనసాగిందని భావించినా ఆ సంఖ్య రెట్టింపై ఉండాలి. కానీ ప్రస్తుతం గణాంకాలు గమనిస్తే వాస్తవంతో అసలు పొంతన లేకుండా ఉన్నాయి.విదేశాల నుంచి మన దేశానికి వచ్చిపోయే విమాన సర్వీసులను కేంద్రం అధికారికంగా రద్దు చేసేసింది. అప్పటికే దేశంలోకి చేరుకున్న వారు క్రమంగా రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్ధితుల్లో ఎవరూ ఎక్కడికీ కదిలే వీలు లేదు. దీన్ని బట్టి చూస్తే వారం క్రితమే వీరంతా స్వస్ధలాలకు చేరుకుని ఉండాలి. ఆ లెక్కన చూస్తే ఏపీకి కూడా విదేశీ ప్రయాణికుల రాక నిలిచిపోయి ఉండాలి. కానీ అలా జరగడం లేదు. ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలను బట్టి చూస్తే రోజుకు వెయ్యి మంది చొప్పున విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్లో చేరుతున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకూ పాతిక వేలుగా ఉన్న సంఖ్య ఇవాళ హెల్త్ బులిటెన్ విడుదల చేసే సమయానికి 29 వేలు దాటింది.అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయినా, వారం రోజుల నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్నా ఏపీలో విదేశీ ప్రయాణికుల రాక కొనసాగుతుందంటే దానికి కారణం రాష్ట్రంలోకి నిబంధనలను ఉల్లంఘించి చేరుతున్న వారేనని తెలుస్తోంది. వీరంతా వివిధ రాష్ట్రాల నుంచి లాక్ డౌన్ నిబంధనలు ఉన్నా అదను చూసి ఏపీలోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే క్వారంటైన్ కు అంగీకరిస్తే చాలు ఏపీలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వీరి రాక సునాయాసంగా మారుతోంది.ఇప్పటికే విదేశాల నుంచి ఎయిర్ పోర్టులకు చేరుకున్న వారిని అధికారులు నేరుగా క్వారంటైన్ కు తరలిస్తున్నారు. అక్కడ వీరి శాంపిల్స్ పరీక్షించి నెగెటివ్ గా తేలితేనే ఇళ్లకు పంపిస్తున్నారు. చాలా మందిని ఇళ్ల వద్దే హోం క్వారంటైన్ సర్వీస్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. అలా చూసినా ప్రస్తుతం రోజురోజుకీ పెరుగుతున్న సంఖ్యను గమనిస్తే వీరంతా ఇప్పటివరకూ ఎక్కడున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీరిలో కొందరు ప్రభుత్వం అందిస్తున్న క్వారంటైన్ సేవల నుంచి తప్పించుకుని బంధువుల ఇళ్లకు, ఇతర ఊర్లకు పారిపోయి కరోనా లక్షణాలు కనిపించగానే తిరిగి క్వారంటైన్ కు వస్తున్నట్లు తెలుస్తోంది.ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకీ విదేశీ ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతుండటంపై సాధారణ జనంతో పాటు విపక్ష నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కావాలనే విదేశీయుల రాక వివరాలను దాచి పెడుతోందని, అందుకే లెక్కల్లో ఇంత గందరగోళం నెలకొందని విపక్ష టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. సీఎం జగన్ తాజా ప్రెస్ మీట్లో చెప్పిన సంఖ్యకూ బయట అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో సంఖ్యకూ పొంతన లేకపోవడాన్ని ఉమ గుర్తుచేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos