కేరళలో అత్యధికం..గుజరాత్‌లో అత్యల్పం

కేరళలో అత్యధికం..గుజరాత్‌లో అత్యల్పం

న్యూఢిల్లీ : కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయంలో కేరళ ముందుండగా, గుజరాత్ వెనుకబడి ఉంది. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో డేటాను ఏఐకేఎస్ నాయకుడొకరు బయట పెట్టారు.. కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయాలు దేశంలోనే అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. గుజరాత్ను దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రమని, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో అధిక వాటా కలిగివున్న రెండవ అతి పెద్ద రాష్ట్రమని (మొదటిది మహారాష్ట్ర) ఊదరగొడుతున్న బీజేపీ నాయకులు దీనికి ఏం సమాధానం చెబుతారని కిసాన్సభ నాయకుడు ప్రశ్నించారు. గుజరాత్ అనే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలన్నిటా ఇదే పరిస్థితి.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే పారిశ్రామికీకరణ బాట పట్టడం, వ్యవసాయ ఉత్పత్తి తగినంతగా ఉండడం, భౌగోళిక, నైసర్గిక పరిస్థితులు అనుకూలించడం ఇవన్నీ గుజరాత్ అభివృద్ధిలో ప్రధాన భూమిక వహించాయి. 1990ల నాటికి అంటే బీజేపీ అధికారంలోకి రాక ముందే ఆ రాష్ట్రం అభివృద్ధి మార్గంలో ఉంది. గత ఇరవై ఏండ్లకు పైగా బీజేపీ పాలన కింద ఉన్న ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కూలీలకు అత్యల్ప వేతనాలు లభిస్తున్నాయి. కేరళలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో కార్మికుల, వ్యవసాయ కూలీల వేతనాలు దేశంలోనే అత్యధికం. చాలా రాష్ట్రాల నుంచి కూలీలు పని కోసం కేరళకు వెళుతుంటారు.
వలసకార్మికులను అక్కడి ఎల్డీఎఫ్ ప్రభుత్వం అతిధి కార్మికులుగా గౌరవిస్తూ, వారికి కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది. కేరళలో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.764.30 కాగా, మధ్యప్రదేశ్లో రూ. 229.20 రూపాయలు, గుజరాత్లో రూ. 241.90 మాత్రమే. ఇది జాతీయ సగటు కన్నా తక్కువ. ఈ కష్టజీవులు సృష్టించే సంపదకు, వారికి లభించే వేతనానికి మధ్య చాలా వ్యత్యాసముంది గుజరాత్లో. పారిశ్రామిక రంగంలో కార్మిల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. వీరికి కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదు. ఈజ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ పేరుతో పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు అధిక రాయితీలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం, కార్మికుల హక్కులను బాహాటంగా కాలరాస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్లో 68.39 లక్షల మంది భూమి లేని వ్యవసాయ కార్మికులున్నారు. ఈ దశాబ్దన్నర కాలంలో వీరి సంఖ్య మరింత పెరిగింది. వీరు కాక అయిదు లక్షల మంది వలసకార్మికులు, 15 లక్షల మంది నిర్మాణ కార్మికులు, వ్యవసాయేతర పనులు చేసే కూలీలు ఉన్నారు. వీరిలో చాలా మందికి కనీస వేతనం కూడా లభించడం లేదు. గుజరాత్ మోడల్ను దేశమంతటికీ విస్తరిస్తామని చెబుతున్న బీజేపీ నేతలు కార్మికులు, వ్యవసాయకూలీలు ఎదుర్కొంటున్న ఈ దయనీయ స్థితి గురించి ఎందుకు మాట్లాడరని ఏఐకేఎస్ నాయకుడు ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos