పంట పొలాల్లో ఏనుగుల స్వైర విహారం

హొసూరు : ఇక్కడికి సమీపంలోని పాత కోట గ్రామ ప్రాంతంలో ఏనుగులు వరి పంటలపై పడి నాశనం చేస్తున్నాయని రైతులు వాపోయారు. కెలవరపల్లి డ్యాం కుడి, ఎడమ కాలువల నీటి ద్వారా సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో

వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. పాతకోట, రామాపురం, గోపసంద్రం, ఆలియాళం తదితర గ్రామాలు ఆటవీ ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఈ గ్రామాలలో ఎక్కువగా వరి పంటను సాగు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా తిష్ఠ వేసిన రెండు ఏనుగులు రాత్రి పూట వరి పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదివారం రాత్రి రామాపురం ప్రాంతంలో ఏనుగులు వరి పంటను నాశనం చేశాయి. ఇది నిత్యకృత్యమైనా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పాతకోట, రామాపురం పరిసర గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులను అడవి లోపలికి తరిమివేయాలని అధికారులను కోరినా అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పంటలను కాపాడాలని వారు కోరుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos