సీఏఏ నిబంధనలను వ్యతిరేకిస్తున్నాం

సీఏఏ నిబంధనలను వ్యతిరేకిస్తున్నాం

న్యూఢిల్లీ : పౌరసత్వ (సవరణ) చట్టం-సీఏఏ నిబంధనలను ప్రకటించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. మతపరమైన గుర్తింపునకు పౌరసత్వాన్ని ముడిపెట్టడం ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరసత్వ లౌకిక సూత్రాన్ని సీఏఏ ఉల్లంఘించిందని పేర్కొంది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో ఒక ప్రకటన జారీ చేసింది. ఈ చట్టం కింద నోటిఫై చేసిన నిబంధనలు పొరుగు దేశాల నుంచి వచ్చిన ముస్లింల పట్ల వివక్షపూరిత దృక్పథాన్ని అమలు చేస్తున్నాయని పొలిట్బ్యూరో విమర్శించింది. పైగా ఈ చట్టం అమలును కూడా జాతీయ పౌర పట్టిక ఏర్పాటుతో ముడిపెట్టడం చూస్తుంటే ముస్లిం పౌరులను లక్ష్యంగా చేసుకుంటారనే భయాందోళనలు తలెత్తుతున్నాయని పేర్కొంది. తమ రాష్ట్రాల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులను గుర్తించడం, వారు పేర్లను నమోదు చేసుకునే క్రమం నుండి రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించేలా ఈ నిబంధనలను రూపొందించారు. సీఏఏ ను తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించేందుకే ఇదంతా జరిగిందని పొలిట్బ్యూరో పేర్కొంది. సీఏఏ ను ఆమోదించి నాలుగేండ్లకు పైగా గడిచిన తర్వాత, పైగా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు కొద్ది రోజులు ముందుగా ఈ నిబంధనలను ప్రకటించడం చూస్తుంటే సీఏఏ అమలును విచ్ఛిన్నకర, ధ్రువీకరణ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోందని స్పష్టమవుతోంది. సీఏఏ ను, దాని అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పొలిట్బ్యూరో పునరుద్ఘాటించింది. ఈ ప్రమాదకరమైన చట్టాన్ని రద్దు చేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos