అందరికీ సమానావకాశాలు కల్పించండి

అందరికీ సమానావకాశాలు కల్పించండి

న్యూఢిల్లీ : రాబోయే సార్వత్రిక ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అందరికీ సమానావకాశాలు కల్పించాలని పలువురు ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు ప్రధాన ఎన్నికల కమిషనర్కు, ఇతర కమిషనర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా నిర్వహించాలంటే ఇది అవసరమని తెలిపారు. ఈ మేరకు సుమారు 90 మంది ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు ఓ బహిరంగ లేఖ రాశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని క్రూరమైన నిబంధనల కింద ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని వారు ఆ లేఖలో ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు, నేతలను వెంటాడి వేధించడం చూస్తుంటే దర్యాప్తు సంస్థల ఉద్దేశాన్ని ప్రశ్నించాల్సి వస్తోందని వారు విమర్శించారు.
కేజ్రీవాల్ అరెస్టుపై నిలదీత
ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సమయాన్ని వారు ఆ లేఖలో ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ కేసును పద మూడు నెలలుగా విచారిస్తున్నారని, అమ్ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు నెలల తరబడి జైలులో ఉన్నారని, వీరిలో సంజరు సింగ్ బెయిలుపై విడుదల కాగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసో డియా ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నారని వివరిం చారు. కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని, అందుకే అరెస్ట్ చేశామని చెబుతున్నారని, అయితే ఆయనను ప్రశ్నించకుండా ఎవరూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలను ప్రకటించి, ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యకు దిగడం ఉద్దేశపూర్వ కంగానే, ప్రేరణతో జరిగిందని తాము భావిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పాత కేసులను ఆదాయపన్ను శాఖ తిరగదోడుతోందని మాజీ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా నివాసంలో జరిగిన సోదాలను వారు గుర్తు చేశారు.
ఈసీపై ఆగ్రహం
ఎన్నికల ప్రక్రియలో క్రియా శీలకంగా వ్యవహరించకుండా ప్రతిపక్షాల స్వేచ్ఛను హరిస్తున్నారని, ఈ కక్షపూరిత రాజకీయాలను చూస్తూ కూడా ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని మాజీ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కమిషన్ వ్యవహార శైలిపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఈసీ నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాటిచెబుతున్నాయని అన్నారు. ఈవీఎంల సమగ్రత పైన, ఓట్ల నమోదులో కచ్చితత్వం కోసం వీవీపాట్ల వినియోగం పైన ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న అనుమానాలను తీర్చేందుకు ఎన్నికల కమిషన్ చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. పాలక పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్ధవంతంగా అమలు చేసే విషయంపై కూడా కమిషన్ శ్రద్ధ వహించడం లేదని వారు ఆరోపించారు. గత ఏడు దశాబ్దాలుగా ఎన్నికల కమిషన్కు నేతృత్వం వహించిన వారు అనుసరించిన మార్గాన్నే అనుసరించాలని కోరారు. ప్రపంచంలోనే
అతి పెద్ద ఎన్నికలప్రక్రియ పవిత్రతను, గొప్పదనాన్ని కాపాడేందుకు నిస్పాక్షికంగా, దృఢచిత్తంతో వ్యవహరిస్తారన్న ఆశతో దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos