ముద్దొచ్చే అబ్బాయిలు

ముద్దొచ్చే అబ్బాయిలు

స్టేజీ మీద ఈ అబ్బాయిలను చూసి అమ్మాయిలే అనుకుంటారని, ప్రేక్షకులలో నుంచి మహిళలు వచ్చి, వారిని హత్తుకుని, బుగ్గమీద ముద్దుల వర్షం కురిపిస్తారని ‘లావణి’ నాట్య బృందాలలో ఒక బృందానికి సారథి అయిన హంకారే చిరునవ్వుతో చెబుతున్నారు. స్త్రీ వేషం ధరించి, థీమ్‌ని మార్చి యువకులు చేస్తున్న ప్రాచీన ‘లావణి’ నాట్య రూపకాలకు మహారాష్ట్రలో ఇప్పుడు అమితమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది.

పాటలు పాడుతూ, నాట్యం చేసే జానపద కళకు ‘లావణి’ అని పేరు. ఇటీవల కొంతకాలంగా మహారాష్ట్ర యువకులు స్త్రీ వేషధారణతో ఈ కళను పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ‘లావణి’ తో ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. ‘నాట్యం చేస్తున్న ఆ మూడు గంటలూ మమ్మల్ని మేం మరచిపోతాం’ అంటాడు ఆనంద్‌ సతామ్‌ అనే లావణి నాట్యకారుడు. మహారాష్ట్ర పట్టణప్రాంతాల్లో అమ్మాయి రూపంలో నాట్యం చేస్తున్న వందలాదిమందిలో ఆనంద్‌ సతామ్‌ ఒకరు. జనవరి 25న ముంబైలోని ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ద పెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌’ లో సావిత్రి మేధాతుల్‌ రచించిన సంగీత రూపకం ‘సంగీత బరి’లో ఆనంద్‌ సతామ్‌ తో పాటు కామ్‌తే అనే యువకుడు ‘లావణి’ ని ప్రదర్శించాడు. ఈ నాట్యం చేసేవారి కదలికలు.. వేదిక మీదే కాదు, వేదిక బయట కూడా స్త్రీలాగే మారుతుంటాయి. దాంతో మగపిల్లలు ఆడపిల్లలుగా మారిపోతారేమోననే భయంతో కుటుంబ సభ్యులు వారిని ఈ పాత్రలు వెయ్యొద్దని నిరోధించేవారు. కాని సతామ్, కామ్‌తే ఇద్దరూ లావణి నాట్యాన్ని ప్రదర్శించడానికే ఉత్సాహం చూపించారు. ‘‘ఒకప్పుడు నన్ను ఈ నాట్యం చేయొద్దని చెప్పినవారే, ఇప్పుడు నా నాట్యం చూసి గర్వపడుతున్నారు, నా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతున్నారు’ అంటాడు కామ్‌తే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos