బీజేపీ-బీజేడీ బంధం ముక్కలు

బీజేపీ-బీజేడీ బంధం ముక్కలు

భువనేశ్వర్ : ఒడిషాలో అధికార బిజూ జనతా దళ్ (బీజేడీ), బీజేపీ మధ్య బంధం ముక్కలయింది. రాష్ట్రంలో త్వరలో జరిగే మొత్తం 21 లోక్సభ, 147 అసెంబ్లీ ఎన్నికల స్థానాల్లో ఈ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేయనున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒడిషాలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన్మోహన్ సమల్ ప్రకటించారు. ‘ఈసారి, రాష్ట్రంలోని మొత్తం 21 లోక్సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది. ఒడిషాలోని 4.5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు సాకారం చేయడమే లక్ష్యం’ అని సోషల్ మీడియా ఎక్స్లో సమల్ పోస్ట్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఒడిషాలో క్షేత్రస్థాయికి చేరుకోవడం లేదని, ఒడిషాలో పేద సోదరులు, సోదరీమణలు ప్రయోజనం పొందడం లేదని ఆయన విమర్శించారు. ‘మేం అనేక అంశాలపై ముఖ్యంగా ఒడిషా గుర్తింపు, ఒడిషా ప్రైడ్, ఒడిషా ప్రజల ప్రయోజనం.. వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో ఏకీభించడం లేదు’ అని కూడా తెలిపారు.
అయితే గత పదేండ్లలో అనేక అంశాలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు బీజేడీకి కృజత్ఞలు తెలిపారు. అలాగే బీజేడీతో బీజేపీ బంధం ముక్కలైన విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రథాన్ కూడా ధ్రువీకరించారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. కాగా, ఈ ప్రకటనతో బీజేపీ-బీజేడీతో మధ్య పొత్తుపై గత 17 రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. అయితే ఈ నెల 6న బీజేడీ నుంచి వచ్చిన ఒక ప్రకటనతోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదనే విషయం ప్రజలకు స్పష్టమయింది. ‘2036 నాటికి అంటే ఒడిషా రాష్ట్రం అవతరించి 100 ఏండ్ల పూర్తయ్యేనాటికి బీజేడీ, ముఖ్యమంత్రి సాధించిన వల్సిన ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి.
ఈ లక్ష్యాలు సాధించడానికి, ఒడిషా, ఒడిషా ప్రజల ప్రయోజనాల కోసం చేయాల్సిన ప్రతిదీ బీజేడీ చేస్తోంది’ అని ఆ ప్రకటనలో తెలిపింది. కాగా, బీజేడీ- బీజేపీ మధ్య సంబంధాలు తెగిపోవడం ఇదే మొదటిసారి కాదు. ముందుగా 1998 నుంచి 2009 నుంచి ఈ రెండు పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. నవీన్ పట్నాయక్ వాజ్పేరు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2008, 2009లో జరిగిన క్రైస్తవ వ్యతిరేక హింసాకాండతో ఈ రెండు పార్టీలు వీడిపోయాయి. ఈ హింసాకాండను బీజేపీ ప్రొత్సహించడం, పాల్గొనడంతో ఆ పార్టీతో బీజేడీ తెగదెంపులు చేసుకుంది. దీంతో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. దారుణమైన ఫలితాలను ఎదుర్కొంది. మళ్లీ 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు జట్టు కట్టాయి. కలిసి పోటీ చేశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos