ఆదాని గ్రూపులో డొల్ల కంపెనీలు

ఆదాని గ్రూపులో డొల్ల కంపెనీలు

న్యూఢిల్లీ : ఆసియా లో అపర కుబేరుడిగా ఎదిగిన గౌతమ్ అదానీకి ఎదురు దెబ్బ తగిలింది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూపుకు చెందిన కంపెనీల షేర్లన్నీ టపాటపా పడిపోయాయి. దీంతో ఇప్పటి వరకు అదానీకి 55 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అదానీ గ్రూపులో ఉన్న మూడు విదేశీ కంపెనీలు నిబంధనలకు విరుద్దంగా పెట్టుబడులు పెట్టాయని భావించి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డిఎల్) ఆ కంపెనీలపై చర్యలు తీసుకుందని ఎకనమిక్ టైమ్స్ సోమవారం బయటపెట్టడడంతో షేర్లన్నీ పడిపోయాయి. ఒకానొక సమయంలో భారీగా షేర్ల విలువ పడిపోతుండడంతో ట్రేడింగ్ను నిలిపివేశారు. ఈ మూడు విదేశీ కంపెనీల ఖాతాలను ఎన్ఎస్డిఎల్ స్తంభించజేసింది. అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఎపిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనే ఈ మూడు విదేశీ పోర్ట్పోలియో కంపెనీలకు అదానీ గ్రూపులో 43,500 కోట్ల విలువ చేసే షేర్లు ఉన్నాయి. మనీ లాండరీంగ్ నివారణ చట్టం కింద ఈ కంపెనీల సమాచారాన్ని వెల్లడించలేదు. సెబీ రిజిస్ట్రేషన్ ప్రకారం ఈ మూడు విదేశీ కంపెనీల అడ్రసు మారిషష్లోని సెయింట్లూయిస్లో ఒక కార్యాలయం పేరుతో ఉంది. దీంతో ఇవి డొల్ల కంపెనీలని నిపుణులు చెబుతున్నారు. అంటే డొల్ల కంపెనీలను సృష్టించి దాని ద్వారా అదానీ గ్రూపులోని పెట్టుబడులను మళ్లించారని అర్ధమౌతోంది. ఇటీవల గౌతమ్ అదానీ సంపద విపరీతంగా పెరిగింది. అదానీ గ్రూపు షేర్లు రెండొందల నుండి నుంచి వెయ్యి శాతం వరకు గత ఒక్క ఏడాదిలోనే పెరిగింది. దీనిపై కూడా సెబీ విచారణ జరుపుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos