కేజ్రీవాల్‌కే మళ్లీ ఢిల్లీ పీఠం : ఎగ్జిట్ పోల్స్

కేజ్రీవాల్‌కే మళ్లీ ఢిల్లీ పీఠం : ఎగ్జిట్ పోల్స్

ఢిల్లీ : ఢిల్లీ వాసులు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కే పట్టం కట్టనున్నారని దాదాపుగా అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. శనివారం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ ముగిసిన కాసేపటికి ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడ్డాయి. 70 మంది సభ్యుల కలిగిన ఢిల్లీ శాసన సభలో మెజారిటీకి 36 స్థానాలు అవసరం కాగా, కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) విజయ ఢంకా మోగించడం ఖాయమని అంచనాలు తెలిపాయి. ఆప్‌ 44 నుంచి 67 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా మాజీ అధ్యక్షుడు అమిత్‌ షాలు కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఢిల్లీ ఓటర్లు కరుణించలేదని ఈ అంచనాలు చెబుతున్నాయి. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి ఒకటి నుంచి రెండు స్థానాలు దక్కవచ్చని పలు సంస్థలు అంచనా వేయగా, ఆ పార్టీ బోణీ  కొట్టడమే కష్టమని మరికొన్ని సంస్థల అంచనాలు తెలిపాయి. కాగా ఢిల్లీ ఎన్నికల్లో 60 శాతం వరకు పోలింగ్‌ నమోదైనట్లు ప్రాథమిక సమచారం. మొత్తం 70 నియోజకవర్గాల్లో 672 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఢిల్లీ ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతాలతో పోలిస్తే ఈసారి నమోదైన పోలింగ్‌ శాతం తక్కువగా ఉంది. పోలింగ్‌ ప్రారంభమైన తొలి గంటలో కేవలం 4 శాతంగా నమోదైన పోలింగ్‌.. ఆ తర్వాత అదే రీతిలో మందకొడిగా కొనసాగినా అనంతరం మెరుగుపడింది. ఇటీవల అనేక ఆందోళనలకు వేదికయిన షహీన్‌బాగ్‌లో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెల్లడికానున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీ సమేతంగా ఓటు వేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, తన కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాతో కలిసి వచ్చి ఓటేశారు. అలాగే, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్రమంత్రులు జయశంకర్‌‌, హర్షవర్దన్‌, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌‌, భాజపా ఎంపీలు పర్వేశ్‌ వర్మ, మీనాక్షి లేఖీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos