ఆకలి భారతంలో 40 శాతం ఆహారం వృథా

ఆకలి భారతంలో 40 శాతం ఆహారం వృథా

భారత్‌లో ఆకలి సమస్య నానాటికీ తీవ్రమవుతోందని ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 119 దేశాల జాబితాలో భారత్‌ 100వ స్థానంలో ఉందని అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) తెలిపింది.ఆకలి సమస్య విషయంలో బంగ్లాదేశ్, నేపాల్‌ల కన్నా భారత్‌ దారుణ స్థితిలో ఉందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. భారత్‌లో పిల్లల్లో పోషకాహార లోపమూ తీవ్రంగా ఉందని పేర్కొంది.ఎంత మందికి ఎలాంటి ఆహారం అందుతోంది? అది ఎంతవరకు అందుబాటులో ఉందనే వివరాలను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తెలుపుతుంది.ఆహార పదార్థాలను వృథా చేయడమే ఆకలి సమస్య పెరగడానికి అసలు కారణమని విశ్లేషకులు చెబుతున్న మాట.ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం భారత్‌లో 40 శాతం వరకూ ఆహారం వృథా అవుతోంది. ఈ ఆహారాన్ని డబ్బు రూపంలో మార్చితే, అది దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా.భారత్‌లో తగినంత ఆహార పదార్థాల ఉత్పత్తి జరుగుతున్నా అందరికీ అది చేరుకోవడంలేదని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో తెలిపింది.ఒక అంచనా ప్రకారం భారత్‌లో 25 శాతం జనాభా ఆకలితో అలమటిస్తోంది. సుమారు 19 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.ఇందులో ఆహారం దొరకనివాళ్లు, దొరికినా పోషకాల లోపంతో బాధపడుతున్నవాళ్లూ ఉన్నారు.

వృథాను అరికట్టడం ఎలా?

వివాహంతోపాటు ఇతర శుభకార్యాల్లో భారీ మొత్తంలో ఆహారం వృథా అవుతోంది. ఈ వృథాను అరికడితే భారత్‌లో తీవ్రమవుతున్న ఆకలి సమస్యను పరిష్కరించొచ్చు.వృథాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు జాగ్రత్త పాటించాలి. ఎంత తినగలమో అంతే వడ్డించుకోవాలి. ఒకవేళ పదార్థాలు మిగిలిపోతే వృథా చేయకుండా అన్నార్తులకు అందించాలి.వివాహం, పార్టీ, హోటళ్లలో ఆహారాన్ని వృథా చేయకూడదు. వృథా అవుతున్న ఆహారాన్ని సేకరించి అన్నార్తులకు వడ్డించే సంస్థలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి.ఇలాంటి ఓ సంస్థే ‘రాబిన్ హుడ్ ఆర్మీ’. దిల్లీలో జరిగే ఒక పెళ్లిలో అందరూ తినగా మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి 500 నుండి 2500 మందికి అందించవచ్చని ఈ సంస్థ ప్రతినిధి సంచిత్ జైన్ చెప్పారు.సరఫరా వ్యవస్థ, నిర్వహణల్లో లోపం వల్లే ఆహార వృథా ఈ స్థాయిలో ఉందని సంచిత్ జైన్ తెలిపారు. ఆహార పదార్థాలు వ్యవసాయ క్షేత్రాల నుంచి మార్కెట్లకు చేరుకుంటున్నాయి. కానీ ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరైన సదుపాయాలు లేవు. సరఫరా వ్యవస్థ సరిగా లేదు. దీంతో ఆహార పదార్థాలు గోదాముల్లోనే కుళ్లిపోతున్నాయని సంచిత్ జైన్ పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలో లోపం కారణంగా కొన్నిసార్లు ధరలు కూడా పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

తాము హోటళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి మురికివాడల్లో నివసించే ప్రజలకు సరఫరా చేస్తామని రాబిన్ హుడ్ ఆర్మీ ప్రతినిధులు తెలిపారు.ప్రభుత్వేతర సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా వృథా నియంత్రణపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నాయి.భారత్‌లో ఆహార వృథాను అరికట్టడం తమ ప్రభుత్వానికి ప్రాధాన్యాంశమని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఇటీవల అమెరికా పర్యటనలో తెలిపారు.ఈ విషయంలో ప్రజలూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తే ఈ సమస్యను అధిగమించొచ్చు. చెన్నైకు చెందిన ఈసా ఫాతిమా జాస్మిన్ కూడా కమ్యూనిటీ ఫ్రిజ్‌ను ఏర్పాటు చేశారు.బెసెంట్‌ నగర్‌లో ఉంచిన ఈ ఫ్రిజ్‌లో చుట్టుపక్కలుండే వారు తమ వంతు ఆహారాన్ని తెచ్చి పెడతారు. హోటళ్లలో మిగిలిపోయిన పదార్థాలను తీసుకొచ్చి ఈ ఫ్రిజ్‌లో పెడతారు. అవసరమున్న వారు ఈ ఫ్రిజ్ నుంచి ఆహారం తీసుకెళ్లొచ్చు ఇలాంటి కృషి చాలా పరిమితంగానే ఉంటుంది. మిగిలిపోతున్న ఆహారాన్ని సక్రమంగా వినియోగించుకునే ఏర్పాటు అన్ని చోట్లా చేస్తే కోట్లాది మంది ఆకలిని తీర్చే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos