రాహుల్‌ ప్రధాని కావాలని కోరుకుంటున్నాం : కుమారస్వామి

రాహుల్‌ ప్రధాని కావాలని కోరుకుంటున్నాం : కుమారస్వామి

బెంగళూరు: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ప్రధాని పదవిలో చూడాలని అనుకుంటున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వెల్లడించారు. జేడీ(ఎస్‌) ఆ దిశగానే పనిచేస్తుందని స్పష్టంచేశారు. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటీవల కోల్‌కతాలో భాజపాకు వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఐక్యతా ర్యాలీ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ర్యాలీకి కుమారస్వామి, ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ కూడా హాజరయ్యారు. ఇటీవల కుమారస్వామి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని సమర్థవంతమైన అభ్యర్థి అని అన్నారు. కాగా ఇప్పుడు రాహుల్‌ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.పలు ప్రధాన పార్టీల మధ్య పొత్తులు పెట్టుకుంటుండటంతో ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయంపై కుమారస్వామి ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘అవును, రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాం. అదే మా పార్టీ నిర్ణయం. అందు కోసమే మేము కృషి చేస్తాం. మాయావతి, మమతా బెనర్జీ కూడా కావొచ్చు. కానీ మేము రాహుల్‌ గాంధీకి మద్దతిస్తాం’ అని చెప్పారు. తన తండ్రి దేవెగౌడ కూడా దీనికి  కట్టుబడి ఉంటారని చెప్పారు. రాహుల్‌ పరిణతి చెందిన రాజకీయ నాయకుడని.. ప్రధాని మోదీ కాగితపు పులి అని అభివర్ణించారు. మోదీ చక్కగా మాట్లాడుతారు, సోషల్‌ మీడియాను బాగా ఉపయోగించుకుంటారు.. కానీ ఈ నాలుగున్నరేళ్లలో ఏం సాధించారు అని కుమారస్వామి ప్రశ్నించారు. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos