మహిళా ఖాజీతో ఒక్కటైన ముస్లిం జంట!

మహిళా ఖాజీతో ఒక్కటైన ముస్లిం జంట!

కోల్‌కతా: ఓ ముస్లిం జంట మహిళా ఖాజీ ద్వారా వినూత్నంగా వివాహం చేసుకున్నారు. ఈ నెల 5న కోల్‌కతాలో జరిగిన ఈ వివాహం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఖాజీ హకిమా ఖటూన్ ఈ వివాహం జరిపించారు. భారతదేశంలో సాధారణంగా పురుష ఖాజీలే వివాహం జరిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న బ్రిటీష్ యువతి మాయా రేచల్ మెక్‌మానస్, నటుడు షామౌన్ అహ్మద్ ఇద్దరూ మహిళా ఖాజీతోనే వివాహం చేసుకోవాలని గతేడాదే నిర్ణయించుకున్నారు. మహిళా ఖాజీలు సైతం వివాహం చేయవచ్చునని కొన్నేళ్ల క్రితమే మాయ దినపత్రికల్లో చదవడంతో ఎలాగైనా మహిళా ఖాజీతో నిఖా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఈ జంట పేర్కొంది . అయితే వీరి కోరిక అంత తేలిగ్గా నెరవేర లేదు. ఎనిమిది నెలల పాటు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన తర్వాత భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ (బీఎంఎంఏ)కి చెందిన ఓ వెబ్‌సైట్ వీరికంటపడింది. బీఎంఎంఏ ఉద్యమంతో ఖురాన్‌లో మహిళా ఖాజీలకు శిక్షణ, రాజ్యాంగ హక్కులపై అవగాహన గురించి అందులో చదివారు. దీంతో బీఎంఎంఏ ద్వారా ఖాజీ హకిమా ఖటూన్‌ను సంప్రదించి తమ కల నెరవేర్చుకున్నారు. కాగా ఇది ‘‘అత్యంత సవాల్‌తో కూడుకున్న పని’’ అని బీఎంఎంఏ సహవ్యవస్థాపకురాలు నూర్జహాన్ సఫియా నియాజ్ పేర్కొన్నారు. ‘‘మరిన్ని జంటలు ఇలా వివాహం చేసుకునేందుకు ముందుకు రావాలి. మరింత మంది మాయాలు, షౌమౌన్ అహ్మద్‌‌లు మనకు అవసరం. కొత్త తరం, ఆధునిక, ఉదారవాదంతో కూడిన ముస్లిం పురుషులు, మహిళలు మనకు అవసరం’’ అని ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటివరకు 16 మంది మహిళా ఖాజీలకు బీఎంఎంఏ శిక్షణ ఇచ్చింది. ఇస్లాంలో న్యాయమూర్తులుగా భావించే ఖాజీలు… కౌన్సిలింగ్ నిర్వహించడం, వివాహం, విడాకుల వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos